ఐసోలేషన్ వార్డులుగా మరిన్ని రైల్వే బోగీలు 

8 Apr, 2020 15:21 IST|Sakshi
ఫైల్ ఫోటో

ఏప్రిల్ 14 నాటికి  50  బోగీలు  సిద్ధం

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వైరస్ బారిన పడ్డ రోగులు ఆదుకునేందుకు భారతీయ రైల్వే వేగంగా కదులుతోంది. ఇప్పటికే వేల బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలిచిన సంస్థ తాజాగా మరిన్ని పడకలను సిద్ధం చేస్తోంది. మరో 50 స్లీపర్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా రూపొదించనున్నామని తూర్పు రైల్వే వెల్లడించింది. ఏప్రిల్ 14 నాటికి అన్ని సౌకర్యాలతో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు మద్దతుగా ఈ ఐసోలేషన్ వార్డులను తయారు చేస్తున్నామని తెలిపింది. అలాగే  వైద్య నిపుణుల సలహా ప్రకారం  రోగులు, వైద్యులు, వారి సంరక్షకులకు అవసరమైన  అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు పేర్కొంది. తూర్పు రైల్వే పరిధిలో 400-500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి అందుబాటులో ఉంటాయని  ప్రకటించింది. 

అధునాతన ఐసోలేషన్ వార్డులుగా మార్చే క్రమంలో బోగీల్లో పలు కీలక మార్పులు చేసినట్టు తెలిపింది. కరోనా వైరస్ రోగులుకు ఎక్కువ స్థలాన్ని అందించడానికి మధ్య బెర్తులు తొలగించడంతోపాటు, మందులు, మెడికల్ రిపోర్టులు, ఇతర వస్తువులను ఉంచుకునేందుకు సైడ్ బెర్త్‌లను తీర్చిదిద్దినట్టు ఈస్ట్రన్ రైల్వే అధికారి సంజయ్ ఛటర్జీ వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కిటికీలకు దోమతెరలు, పారదర్శక ప్లాస్టిక్ కర్టెన్లు, కొత్త ఎలక్ట్రికల్ పాయింట్లు సహా  అన్ని సౌకర్యాలను  సమకూర్చనున్నట్టు చెప్పారు.  కాగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటికే  2,500 రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చి  లక్షల అధునాతన పడకలను  రోగులకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. 

చదవండి: కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు