రుణ గ్రహీతలకు భారీ ఊరట

27 Mar, 2020 11:16 IST|Sakshi

అన్ని రకాల లోన్లపై 3 నెలల మారటోరియం

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఆర్‌బీఐ కీలక ప్రకటన  రుణ గ్రహీతలకు భారీ ఊరటనిచ్చింది. వచ్చే 3నెలలు అన్ని లోన్ల ఈఎంఐలపై మారటోరియం విధించింది. దీంతో గృహ రుణాలతో సహా అన్నిరకాల  రుణాలపై మూడు నెలలు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించినట్లు అయింది. దేశంలోని  అన్ని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు ఇది వర్తిస్తుందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. అలాగే మూలధన సమీకరణ కోసం ఇబ్బందులు పడుతున్న బ్యాంకులను ఎన్‌పీఏలుగా ప్రకటించమని ఆయన చెప్పారు.

సహకార సహా, అన్ని  రకాల రుణాలపై కూడా 3 నెలలు విధించిన తాజా మారటోరియం తో ఇప్పుడు కట్టాల్సిన రుణాలను గడువు తర్వాత ఎప్పుడైనా చెల్లించవచ్చు.  ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో భాగంగా ప్రధానంగా నాలుగు చర్యలు తీసుకున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రణాళికలను సిద్దం చేయడం,మార్కెట్లలో లిక్కిడిటీ స్థిరత్వం, బ్యాంకుల రుణాల ప్రక్రియలో నిలకడ, చెల్లింపుల్లో సడలింపు చర్యలు, మార్కెట్ అస్థిరతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు  గవర్నర్‌ వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకులు, రుణాలు జారీ చేసే సంస్థలకు సంబంధిత మార్గదర్శకాలను ఆర్‌బీఐ జారీచేసింది.

ఈ క్రమంలో రెపో రేటును 75శాతం బేసిస్ పాయింట్లకు తగ్గించి 4.40 శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. రివర్స్ రెపో రేటును కూడా 90  బేసిస్ పాయింట్ల  తగ్గించామన్నారు.  వినియోగదారులకు తమ డిపాజిట్లు, నగదుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. వైరస్ పట్ల సురక్షితంగా వుంటూ డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని శక్తికాంతదాస్ సూచించారు. (కరోనా ప్రభావం: ఆర్‌బీఐ కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు