ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో

20 Apr, 2020 10:47 IST|Sakshi

విప్రో ఔదార్యం,  ప్రతిరోజు 20లక్షల పైగా ప్రజలకు భోజనం

సాక్షి, ముంబై:  కరోనా పై పోరులో ఇప్పటికే  పెద్ద మనసు చాటుకున్న ఐటీ సేవల సంస్థ  విప్రో తన  సేవలను కొనసాగిస్తోంది. తమ సంస్థ  ప్రతిరోజు 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేసిందని  విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ  తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్‌ కష్టాలు పడుతున్న ప్రజలకు  ఇతర సంస్థల  సహాయక చర్యలను ఆయన ప్రశంసించారు.  మహమ్మారితో పోరాడుతున్న దేశానికి అందరూ  సహాయ, సహకారాలు అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మానవతా దృక్పథంతో ఇప్పటికే చాలా సంస్థలు పనిచేస్తున్నాయి వారందరికీ నమస్కరిస్తున్నాను. ఈ అవసరం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నందున దయచేసి అందరూ చేయగలిగినదంతా చేయాలని ఆయన కోరారు. విప్రో క్యాంపస్ క్యాంటీన్ల ద్వారా 14-21 రోజులుగా రోజూ 60 వేలకు పైగా ప్రజలకు తాజాగా వండిన భోజనాన్ని,  పూర్తిస్థాయి రేషన్ సరుకులను అందజేశామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఏప్రిల్ 6 న ట్విటర్‌లో తెలిపారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ప్రకటించారు. ఈ  మాటను నిలబెట్టుకున్న ఫౌండేషన్ తాజాగా రోజుకు  20 లక్షల మందికి పైగా ఆహారం సరఫరా చేస్తుండటం ప్రశంసనీయం. (విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ 1,125 కోట్లు)

కాగా కోవిడ్-19 తో పోరాడటానికి అజీమ్ ప్రేమ్‌జీ యాజమాన్యంలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఫౌండేషన్ రూ.1125 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షల మధ్య ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పలు కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వ్యాపారవేత్తలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నాయి. టాటా గ్రూప్ మొత్తం రూ .1,500 కోట్లను ప్రకటించింది. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లు  తెలపింది. అలాగే ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా విరాళంతో పాటు, తమ కర్మాగారాల్లోని క్యాంటీన్లలో అరటి ఆకులను ప్లేట్లుగా ఉపయోగించడం ద్వారా అరటి రైతులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు