మార్కెట్లకు ‘వ్యాక్సిన్‌’!

3 Jul, 2020 00:55 IST|Sakshi

  సానుకూలంగా కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు

రూపాయి 56 పైసలు అప్‌

429 పాయింట్లు పెరిగి 35,844కు సెన్సెక్స్‌

122 పాయింట్ల లాభంతో 10,552కు నిఫ్టీ 

సాక్షి, ముంబై: కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలు ఇస్తున్నాయన్న వార్తలతో  ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా గురువారం లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 56 పైసలు పుంజుకొని 75.04కు చేరడం  కూడా కలసివచ్చింది. ఇంట్రాడేలో 36,000 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, సెన్సెక్స్‌ ఆ స్థాయి వద్ద నిలదొక్కుకోలేకపోయింది. నిఫ్టీ మాత్రం కీలకమైన 10,500 పాయింట్లపైకి ఎగబాకింది. 122 పాయింట్ల లాభంతో 10,552 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఇంట్రాడేలో 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 429 పాయింట్లు లాభంతో 35,844 పాయింట్ల వద్ద ముగిసింది.

జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్, అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఫైజర్‌లు సంయుక్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రాథమిక ఫలితాలు సానుకూలంగా ఉన్నాయన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు 1–2 శాతం రేంజ్‌ లాభాల్లో ముగిశాయి. మన దగ్గర ఐటీ, వాహన, ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.  
-ట్రాక్టర్ల అమ్మకాలు పెరగడంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 6 శాతం లాభంతో రూ.  530 వద్ద ముగిసింది.
-దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. జుబిలంట్‌ లైఫ్, బేయర్‌ క్రాప్‌సైన్స్‌ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.  
-దాదాపు 450కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్‌ రిటైల్, అదానీ గ్రీన్, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్, ఐడీబీఐ బ్యాంక్‌ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.  
-మేలో కంటే జూన్‌లో వాహన విక్రయాలు పుంజుకోవడంతో వాహన షేర్లు పెరిగాయి.  
-వివిధ దేశాల్లో తయారీ పుంజుకుంటుందన్న గణాంకాలతో లోహ షేర్లు లాభపడ్డాయి.

నిఫ్టీ నుంచి వేదాంత అవుట్‌..!  
స్టాక్‌ మార్కెట్‌ నుంచి స్వచ్ఛందంగా డీలిస్ట్‌ కానుండటంతో నిఫ్టీ 50 సూచీ నుంచి వేదాంత ను తొలగిస్తున్నారు. వేదాంత స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని చేరుస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. నిఫ్టీ 50 నుంచే కాకుండా నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ 100, నిఫ్టీలార్జ్‌మిడ్‌క్యాప్‌ 250 సూచీల నుంచి కూడా వేదాంతను తొలగిస్తున్నామని పేర్కొంది.

రైల్‌ షేర్లు రయ్‌..!
ప్రయాణికుల రైళ్లను నడపడానికి ప్రైవేట్‌ సంస్థలను అనుమతించనుండటంతో రైల్వేల సంబంధిత కంపెనీల షేర్లు దూసుకుపోయాయి. టెక్స్‌మాకో రైల్‌ అండ్‌ ఇంజినీరింగ్, సిమ్‌కో, రైల్‌ వికాస్‌ నిగమ్, టిటాఘర్‌ వ్యాగన్స్, ఐఆర్‌సీటీసీ షేర్లు 4–13 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ మూడు ప్రైవేట్‌ రైళ్లను నడుపుతోంది. మొత్తం 12 క్లస్టర్లలో 109 రూట్లలో 151 రైళ్లను నడపటానికిగాను ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను రైల్వే సంస్థ ఆహ్వానించింది. భారత రైల్వేల నెట్‌వర్క్‌లో ప్రయాణికుల రైళ్లను నడపటానికి ప్రైవేట్‌ సంస్థలను అనుమతించడంలో ఇది తొలి అడుగు. ఈ నిర్ణయం కారణంగా రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 

మరిన్ని వార్తలు