కరోనా : అమెజాన్‌లో వారికి భారీ ఊరట

2 Jul, 2020 12:13 IST|Sakshi

10 లక్షలమందికి  పైగా వ్యాపారులకు ఊరట

మరో 10 వారాలపాటు100 శాతం అమ్మకం ఫీజు రద్దు

సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అమెజాన్ చేతివృత్తులు, చిన్న, మహిళా వ్యాపారులకు మరోసారి భారీ ఊరట కల్పించింది. ఎస్ఓఏ (సేల్ ఆన్ అమెజాన్) ఫీజును తాజాగా 100 శాతం  రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మరో 10 వారాలపాటు ఈ మినహాయింపును పొడిగిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఫలితంగా లక్షలాదిమంది  వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. 

కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాలనుంచి చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 10 లక్షల మందికి పైగా పారిశ్రామికవేత్తలు కోలుకునేలా సాయం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధి ప్రణవ్ భాసిన్  వెల్లడించారు. అమెజాన్ అందిస్తున్న కారీగర్ ప్రోగ్రాం ద్వారా 8 లక్షలకు పైగా చేతివృత్తులవారు, నేత కార్మికులు, అమెజాన్ సహేలి ప్రోగ్రాం ద్వారా 2.8 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు 100 శాతం అమ్మకం ఫీజు మినహాయింపుతో ప్రయోజనం పొందుతారని అన్నారు. ఈ రెండు ప్రోగ్రామ్‌లలో చేరిన కొత్త అమ్మకందారులకు కూడా ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని చెప్పారు. వీరి ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం ద్వారా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడంతోపాటు, వారికి మూలధన సహాయానికి తోడ్పడుతుందని భాసిన్ తెలిపారు.(అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు)

కారీగర్, సహేలి అమ్మకందారుల నుండి స్థానికంగా రూపొందించిన, చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు కస్టమర్ డిమాండ్‌ను పెంచేందుకు 'స్టాండ్ ఫర్ హ్యాండ్‌మేడ్' స్టోర్ ను కూడా ఏర్పాటు చేసినట్టు భాసిన్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వ ఎంపోరియంలు, ఐదు ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం ఉందన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశం సహా వివిధ ప్రాంతాల చేతివృత్తులవారు, మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. అలాగే మహిళలకోసం మహిళలు రూపొందించిన ఉత్పత్తులు కూడా లభిస్తాయని ఆయన ప్రకటించారు. కాగా జూన్ 2020 చివరి వరకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ ఫీజును 50 శాతం మాఫీ చేస్తున్నట్టు గత నెలలో ప్రకటించింది. అలాగే స్టోరేజ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్టు  అమెజాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు