కోలుకొని మళ్లీ కూలిన మార్కెట్లు!

11 Mar, 2020 02:55 IST|Sakshi

8 శాతం ఎగసిన చమురు ధరలు

ఉద్దీపన చర్యలపై ఆశలు

లాభపడిన ఆసియా మార్కెట్లు

ఆరంభంలో పుంజుకున్న యూరప్‌ మార్కెట్లు

ఇటలీలో ముదిరిన కోవిడ్‌–19 కల్లోలం

దీంతో నష్టాల్లోకి జారిపోయిన యూరప్‌ మార్కెట్లు

తీవ్ర ఒడిదుడుకుల్లో అమెరికా స్టాక్‌ సూచీలు  

హాంకాంగ్‌: సోమవారం నాటి భారీ పతనం నుంచి మంగళవారం  ప్రపంచ మార్కెట్లు కోలుకొని ఆ తర్వాత మళ్లీ కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి, యూరప్‌ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోగా, అమెరికా స్టాక్‌ సూచీలు లాభ నష్టాల మధ్య తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు పుంజుకోవడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. అయితే చైనాలో అదుపులోకి వచ్చినా, ఇతర దేశాల్లో కోవిడ్‌–19 (కరోనా)వైరస్‌ కల్లోలం కొనసాగుతుండటంతో యూరప్‌ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. . కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటం, ముడిచమురు ధరల పోరు మొదలుకావడంతో సోమవారం ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లన్నీ 2–8 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి.

నష్టాల్లోంచి లాభాల్లోకి..... 
మంగళవారం ముడిచమురు ధరలు 8% మేర ఎగియడంతో ప్రపంచ మార్కెట్లు ముఖ్యంగా ఆసియా సూచీలు పుంజుకున్నాయి. కరోనా వైరస్‌ మూల కేంద్రమైన వూహాన్‌ నగరాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సందర్శించడం, గత వారమే రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి రేట్లను తగ్గిస్తుందన్న వార్తలు,  వైరస్‌ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి అమెరికా ప్రభుత్వం ఉద్దీపన చర్యలు తీసుకోనున్నదన్న అంచనాలు... సానుకూల ప్రభావం చూపించాయి. సోమవారం అమెరికా మార్కెట్లు 8 శాతం మేర నష్టపోయిన నేపథ్యంలో మంగళవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. అయితే మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం రేంజ్‌లో లాభాల్లో ముగిశాయి.

లాభాల్లోంచి నష్టాల్లోకి... 
ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి రాగా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో యూరప్‌ మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమై 1–2.5% రేంజ్‌ లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే ఇటలీలో కోవిడ్‌–19 వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య, ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య పెరగడం, ఆ దేశంలో ప్రయాణాలు, సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి మరికొంత సమయం పడుతుందనే వార్తలతో యూరప్‌ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి. డ్యాక్స్‌ (జర్మనీ), క్యాక్‌(ఫ్రాన్స్‌) సూచీలు 0.7 శాతం నుంచి 1.5 శాతం రేంజ్‌లో నష్టాల్లో ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్‌ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యలో నష్టాల్లోకి జారిపోయి, మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. మొత్తం మీద తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి గం.11.30ని.)కు 0.7–1.2% రేంజ్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ ప్రతిరూపం... ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 1% (115 పాయింట్లు)నష్టంతో ట్రేడవుతోంది. దీంతో నేడు(బుధవారం) మన మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యే అవకాశాలే అధికం గా ఉన్నాయని విశ్లేషకులంటున్నారు.

మరిన్ని వార్తలు