కరోనా భయమా? మీకో బుల్లి పెట్టె : రూ.500 లే

10 Apr, 2020 16:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కరోనా వైరస్...ఇది అతి సూక్ష్మ జీవి అయినా విశ్వం మొత్తాన్ని గజగజ లాడిస్తోంది. ఎక్కడ ఎలా పొంచి వుందో తెలిదు..ఎటునుంచి దాపురిస్తుందో తెలియదు..ఏ వస్తువుపై దాక్కొని ఎలా పంజా విసురుతుందో తెలియదు. దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ దేశప్రజలను పట్టి పీడిస్తున్న ఆందోళన ఇది. ముఖ్యంగా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందితోపాటు, మందులు,  కూరగాయలు, కిరాణా లాంటి అత్యవసర వస్తువులను విక్రయిస్తున్న దుకాణదారులను ఈ భయం వెంటాడుతోంది. అయితే కరోనా మహమ్మారి  భయాలకు చెక్ పెడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)  రోపార్ ఒక కొత్త పరికరాన్ని రూపొందించింది. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో మనం వాడే నిత్యాసర సరుకులను ఈ  వైరస్ బారినుంచి కాపాడుకోవచ్చని వెల్లడించింది.

అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో  ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. డబ్బులు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఆన్ లైన్ ద్వారా డెలివరీ అయిన వస్తువులు, చేతి వాచీలు, పర్సులు, మొబైల్ ఫోన్లు ఇలా దేన్నైనా ట్రంక్‌ పెట్టెలో ఉంచి, శుభ్రం చేసుకోవచ్చని బృందం సిఫార్సు చేస్తోంది. వాటర్ ప్యూరిఫైయర్లలో ఉపయోగించే అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని గుమ్మం వద్దనే  పెట్టుకోవాలని, అపుడు బయట నుంచి తీసుకొచ్చిన సరుకులు, డబ్బులను దాని కింద  ఉంచి త్వరగా శుభ్రం చేసుకోవచ్చని తెలిపింది. కేవలం 30 నిమిషాల సమయంలో వైరస్‌ను అంతం చేస్తుందని  పేర్కొంది. 30 నిమిషాలు శానిటైజ్ చేసిన తర్వాత ఓ పది నిమిషాలు చల్లబడే వరకు అలాగే వదిలేయాలని చెప్పింది. అంతేకాదు దీని ధర రూ.500 కన్నా తక్కువ ధరకే లభిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎలాంటి ఆందోళన లేకుండా, సులువుగా కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువచ్చిన అన్ని వస్తువులను శుభ్రం చేసుకోవచ్చని ఐఐటీ రోపర్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నరేష్ రాఖా ప్రకటించారు.  (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరిపోదు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలంటే మరిన్ని జాగ్రత్తలు తప్పవని నరేష్ రాఖా సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది కూరగాయలను కూడా వేడి నీళ్లలో కడుగుతున్నారు. అయితే, డబ్బులను అలా కడగలేం కదా. అందుకే ఈ పరికరాన్ని తయారు చేశామని చెప్పారు. గుమ్మం దగ్గర. లేదా, ఇంటి లోపలికి రావడానికి ముందు బయట ఎక్కడైనా పెట్టుకుని తెచ్చుకున్న సరుకులను శానిటైజ్ చేసుకోవాలని  తెలిపారు. అయితే ట్రంక్ లోపల  కాంతి హానికరం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా చూడకూడదని,ప్రమాదమని హెచ్చరించారు.  కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  అందించిన సమాచారం  ప్రకారం కరోనావైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 199కు పెరిగింది. 6,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

చదవండి : వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్
జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్

మరిన్ని వార్తలు