ఒడిదుడుకులుంటాయ్‌...!

13 Apr, 2020 05:00 IST|Sakshi

లాక్‌డౌన్, కరోనా వార్తలు కీలకం

అంతర్జాతీయ సంకేతాల ప్రభావం

అంబేద్కర్‌ జయంతి...ఈ నెల 14న సెలవు

ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులే

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో ఈ వారం తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ సంబంధిత పరిణామాలే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను నిర్దేశిస్తాయని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ సంకేతాలు కూడా కీలకమేనని నిపుణులంటున్నారు. ఈ నెల 14(మంగళవారం) అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానున్నది.  

నేడు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు....
మార్చి నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం), టోకు ధరల ద్రవ్యోల్బణ గణాం కాలు మంగళవారం(ఏప్రిల్‌ 14న) వెలువడుతాయి. ఇక ఈవారం నుంచే క్యూ4 ఫలితాల సీజన్‌ మొద లవుతోంది. బుధవారం(ఈ నెల 15న) విప్రో, ఈ నెల 16న(గురువారం) టీసీఎస్, ఈ నెల 18న (శనివారం) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు వస్తాయి.  

లాక్‌డౌన్‌కు, మార్కెట్‌కు లింక్‌!  
దశలవారీగానైనా లాక్‌డౌన్‌ను తొలగిస్తే, ఆర్థిక కార్యకలాపాలు పాక్షికంగానైనా పుంజుకుంటాయనే అంచనాలతో ఇటీవల మార్కెట్‌ భారీగా పెరిగింది. అయితే లాక్‌డౌన్‌ పొడిగింపు సూచనలే కనిపిస్తుండటం.. మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపుతుందని అంచనా. అయితే జనాలే కాదు, జీవనోపాధి కూడా ముఖ్యమేనని ప్రధాని వ్యాఖ్యానించడంతో లాక్‌డౌన్‌ నుంచి ఒకింత ఊరట లభించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.  

కొనసాగుతున్న ‘విదేశీ’ విక్రయాలు
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సురక్షిత మదుపు సాధనాలైన పుత్తడి, డాలర్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడానికే విదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే భారత్‌ లాంటి వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కాగా ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.2,951 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.6,152 కోట్లు.. వెరసి మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.9,103 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో రికార్డ్‌ స్థాయిలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.      

మరిన్ని వార్తలు