దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్

6 Apr, 2020 12:45 IST|Sakshi
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘు రామ్ రాజన్ (ఫైల్ ఫోటో)

సాక్షి,న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి కరోనా మహమ్మారి విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విస్తరణ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ  మరింత సంక్షోభంలోకి జారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. షికాగో బిజినెస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా ఉన్న రాజన్ దేశం స్వాతంత్ర్యం తరువాత 2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి, తీవ్రమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. 'ఇటీవలి కాలంలో భారతదేశపు గొప్ప సవాలు' అనే  పేరుతో తన బ్లాగులో ఈ విషయాలను పేర్కొన్నారు.  ( కరోనా : రఘురామ్ రాజన్ సూచనలు)

ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008-09 నాటి కంటే నేడు తీవ్రంగా వుంది. 2008-09లో అదొక తీవ్రమైన డిమాండ్ షాక్. ఆ సమయంలో కార్మికులు యధావిధిగా పనులకు వెళ్లారు. మన దేశానికి సంబంధించి పలు సంస్థలు బలమైన వృద్ధిని సాధించాయి. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇపుడు కుదేలై ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడలేకపోతున్నాయని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్  పరిస్థితుల్లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆర్థిక సంక్షోభంపై పోరాడటానికి సాధ్యమైన చర్యలను కూడా ఆయన సూచించారు.

లాక్ డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం  ఇపుడు  దృష్టి పెట్టాలని రాజన్ బ్లాగులో పేర్కొన్నారు. భౌతిక దూరం లాంటి  కీలక జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన యువతను, కార్యాలయానికి సమీపంలోని హాస్టళ్లలో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలని సూచించారు. తయారీదారులు తమ మొత్తం సరఫరా గొలుసును తిరిగి కొనసాగించడానికి, త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఆవైపుగా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రణాళికలను రూపొందించడం, ఆమోదించడంతో పాటు సమర్ధవంతంగా అమలయ్యేలా పరిపాలన విభాగం చూడాలని పేర్కొన్నారు.  ప్రస్తుత పరిమిత ఆర్థిక వనరులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా  కూడా నిరుపేదల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని,  మానవత్వంతో వారిని ఆదుకోవడం సరైన పని అని రాజన్  ప్రధానంగా సూచించారు.

చదవండి : కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్

లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

మరిన్ని వార్తలు