అయ్యో.. ఆతిథ్యం!

7 Apr, 2020 01:02 IST|Sakshi

హోటళ్లకు కరోనా కష్టాలు...

67 శాతం పడిపోయిన ఆక్యుపెన్సీ

73 శాతం తగ్గిపోయిన ఆదాయం

మూసివేత రిస్కుల్లో చిన్న హోటళ్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సంబంధించి లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో హోటల్‌ పరిశ్రమ పెనుసవాళ్లు ఎదుర్కొంటోంది. ఆక్యుపెన్సీ పడిపోయి, ఆదాయాలు తగ్గిపోయి ఆందోళన చెందుతోంది. రీసెర్చ్‌ సంస్థ ఎస్‌టీఆర్‌ నివేదిక ప్రకారం మార్చి 7 నాటికి ఆక్యుపెన్సీ 12 శాతం తగ్గగా.. మార్చి 21 నాటికి (లాక్‌డౌన్‌ ప్రకటించడానికి మూడు రోజుల ముందు) ఏకంగా 67 శాతం పడిపోయింది. ఆదాయాలు అంతకన్నా ఎక్కువగా పడిపోయాయి. ఫుడ్, బేవరేజెస్‌ అమ్మకాలు, ఈవెంట్స్‌ నిర్వహణ దెబ్బతినడంతో మార్చి 7 నాటికి ఆదాయంలో 20 శాతమే తగ్గుదల ఉండగా.. ఆ తర్వాత మార్చి 21 నాటికి ఏకంగా 73 శాతం పడిపోయింది.

ఇదే పరిస్థితి కొనసాగితే గతేడాది ఆదాయాల్లో కనీసం 20 శాతం కూడా రాబట్టుకోవడం కూడా కష్టం కాగలదని హాస్పిటాలిటీ కన్సల్టింగ్‌ సంస్థ హోటెలివేట్‌ పేర్కొంది. గతేడాది రూ. 37,000 కోట్లుగా ఆదాయం ఉండగా.. 2020లో ఇందులో 15–20% మాత్రమే హోటల్‌ పరిశ్రమ ఆర్జించవచ్చని ఓ నివేదికలో తెలిపింది. సత్వరం ఒడ్డున పడేసే చర్యలు తీసుకోకపోతే దేశీయంగా బ్రాండెడ్‌.. సంఘటిత హోటల్‌ మార్కెట్‌ నెలల తరబడి మందగమనంలో పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. వర్కింగ్‌ క్యాపిటల్, స్వల్పకాలిక రుణ లభ్యత లేక చిన్న స్థాయి హోటళ్లు దివాలా తీసే రిస్కులు ఉన్నాయని హోటెలివేట్‌ హెచ్చరించింది. దేశీయంగా సంఘటిత రంగంలో  1,000 బ్రాండ్లు.. 1,25,000 గదులు ఉన్నాయని అంచనా. ఇవి కాక అసంఘటిత రంగంలో 1,2,3 స్టార్‌ కేటగిరీకి చెందిన అన్‌బ్రాండెడ్‌ హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి.  

లక్షల్లో ఉద్యోగాలకు ఎసరు..
వ్యాపారం పూర్తిగా నిల్చిపోయిందని పేరొందిన ఓ హోటల్‌ చెయిన్‌ సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. బ్రాండెడ్‌ హోటళ్ల రంగంలోనే ఏకంగా 2,00,000 మంది పైగా సిబ్బంది ఉండగా అన్‌బ్రాండెడ్, అసంఘటిత హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌ హౌస్‌లు మొదలైన వాటి ద్వారా ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు, సాధారణంగా చాలామటుకు హోటళ్ల వ్యయాల్లో జీతభత్యాలు మొదలైన వాటి వాటా 17–22% దాకా ఉంటుందని హోటెలివేట్‌ తెలిపింది. వ్యాపారం సజావుగా సాగినా సాగకు న్నా ఈ వ్యయాలు తప్పవని పేర్కొంది. సిబ్బంది జీతభత్యాల కోసం హోటళ్లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరం ఎంతగానో ఉందని వివరించింది.

భారీ రుణభారం...
వ్యాపార విస్తరణ కోసం, హోటళ్ల ఆధునికీకరణ కోసం సంఘటిత రంగ హోటళ్లు భారీగా రుణాలు తీసుకున్నాయి. 2020 జనవరి నాటికి వీటి మొత్తం రుణభారం దాదాపు రూ. 45,000 కోట్ల పైగా ఉంది. రాబోయే రోజుల్లో హోటళ్లు నెలవారీగా కట్టాల్సిన అసలు, వడ్డీలే వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని హోటెలివేట్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ అచిన్‌ ఖన్నా చెప్పారు. వీటి చెల్లింపులకు సంబంధించి కనీసం 6–9 నెలల పాటైనా ఉపశమనం దొరికేలా ప్రభుత్వం, రుణాలిచ్చిన సంస్థలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగించే యోచనేదీ లేదని ప్రభుత్వం చెబుతున్నా... వ్యాపారం మళ్లీ పట్టాలెక్కేందుకు చాలా నెలలు పట్టేస్తుందని హోటల్‌ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ప్రయాణాలపరమైన ఆంక్షలు సడలించినా హోటల్‌ వ్యాపా రాలు అప్పుడే పుంజుకోవడం కష్టమని భావిస్తోంది. పర్యాటకం ద్వారా (హోటళ్లు, టూరిజం సంస్థలు, మధ్యవర్తులు) దాదాపు 5.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో 70% మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందనేది పరిశ్రమ వర్గాల మాట. ఇప్పటికే ఉద్యోగాల్లో కోత మొదలైందని, ఇది మరింత తీవ్ర రూపు దాల్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు