కరోనా : బంగారం మరో రికార్డు

24 Jun, 2020 14:23 IST|Sakshi

దేశీయంగా 48,420 రూపాయల వద్ద కొత్త  రికార్డు

అంతర్జాతీయంగా 8 సంవత్సరాల గరిష్టం

స్వల్పంగా తగ్గిన వెండి 

సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య, బంగారం ధర మరోసారి కొత్త గరిష్టాన్ని తాకింది. కోవిడ్-19 కేసులు తిరిగి పుంజుకుంటూ ఉండటంతో ఆర్థిక పునరుద్ధరణపై ఆందోళనల నేపథ్యంలో పెట్టుబడులు పుత్తడివైపు మళ్లాయి. అంతర్జాతీయంగా  రికార్డు  ధర పలికిన  పసిడి దేశీయంగా కూడా అదే బాటలో పయనించింది. ఫలితంగా బుధవారం 10 గ్రాముల ధర 48,420 రూపాయల వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. 10 గ్రాములకు మంగళవారం నాటి ముగింపు 48,232 రూపాయలతో పోలిస్తే నేడు 48,333 రూపాయల వద్ద ప్రారంభమైంది.  అనంతరం మరింత  ఎగిసి కొత్త  రికార్డును తాకింది.  ఇక దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ఢిల్లీలో 10 గ్రాములకు  46,800 రూపాయలు కాగా, 24 క్యారెట్ల రిటైల్ ధర 48000 రూపాయలు పలుకుతోంది. అయితే వెండి ధర స్వల్పంగా తగ్గి కిలో ధర 48716 రూపాయలు వద్ద  వుంది.

అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌ 1773 డాలర్ల  వద్ద ఎనిమిది సంవత్సరాల గరిష్టస్థాయిని తాకింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం భయాలతో డాలరు బలహీనపడింది. దీంతో బంగారం ధర 2012 మార్చి స్థాయికి చేరుకుందని విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారు ధర పరుగు కొనసాగుతుందని, మహమ్మారి విస్తరణ, మరోసారి లాక్‌డౌన్‌ కు దారితీస్తుందనే భయం కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారంవైపు మొగ్గుతున్నారన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లోని బలహీనత బంగారానికి డిమాండ్ పెంచుతోందని అనుజ్ గుప్తా (డివిపి-కమోడిటీస్ అండ్ కరెన్సీ రీసెర్చ్, ఏంజెల్ బ్రోకింగ్) తెలిపారు. త్వరలోనే  ఔన్సు ధర 1,800 డాలర్ల నుండి 1,830 డాలర్ల స్థాయిలను తాకనుందని అంచనా వేశారు. 

>
మరిన్ని వార్తలు