ప్యాకేజీ ఇవ్వాలి

15 Apr, 2020 03:14 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థ పునర్‌నిర్మాణానికి ఉద్దీపనలు ప్రకటించండి..

లాక్‌డౌన్‌ పొడిగింపు అవసరమే; వైరస్‌ కట్టడికి ఇదే ఆయుధం 

ఈలోపు తగిన విధంగా సన్నద్ధం కావచ్చు: కార్పొరేట్‌ ఇండియా

న్యూఢిల్లీ: మూడు వారాల లాక్‌డౌన్‌కే దేశ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చన్న అంచనాలు ఉండగా, ప్రధాని మోదీ ఈ లాక్‌డౌన్‌ను మరో మూడు వారాలు అంటే మే 3 వరకు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని దేశీ పరిశ్రమలు(కార్పొరేట్‌ ఇండియా) స్వాగతించాయి. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఈ వైరస్‌ను నివారించేందుకు లాక్‌డౌన్‌ కొనసాగింపు తప్పనిసరి అని కార్పొట్లు అభిప్రాయ పడ్డారు. కాకపోతే ఈ వైరస్‌ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించుకునేందుకు ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని కోరాయి. హాట్‌స్పాట్‌ (వైరస్‌ కేసులు లేని) కాని ప్రాంతాల్లో ఈ నెల 20 తర్వాత ఆంక్షలను కొద్ది మేర సడలించనున్నట్టు ప్రధాని తన ప్రసంగంలో సంకేతాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి బుధవారం మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.   

రోజూ రూ.40,000 కోట్ల నష్టం: ఫిక్కీ
‘దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల దేశం రోజూ రూ.40,000 కోట్లను నష్టపోతుందని అంచనాలు తెలియజేస్తున్నాయి. అంటే మొదటి 21 రోజుల లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడే నష్టం రూ.7–8 లక్షల కోట్లు. పైగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య 4 కోట్ల మంది ఉపాధి ప్రమాదంలో పడనుంది. కనుక సత్వరమే ఉపశమన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. దశలవారీగా ఆర్థిక కార్యకలాపాల ప్రారంభానికి ప్రధాని ఇచ్చిన సంకేతాలు కొంత ఉత్పత్తి ఆరంభానికి వీలు కల్పిస్తుంది’ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. 

తగిన విధంగా సన్నద్ధం కావచ్చు: సీఐఐ 
‘వైరస్‌ కేసుల క్రమాన్ని చూస్తే లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్న ప్రధాని నిర్ణయం అవసరం. ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ను క్రమంగా ఉపసంహరించడంపై ప్రధాని మార్గద్శకం చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగింపు వల్ల క్రమ పద్ధతిలో, సురక్షితంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం తగిన విధంగా నన్నద్ధం కావచ్చు. అదే విధంగా పరిశ్రమలు సైతం కార్యకలాపాల ప్రారంభానికి  తగిన వ్యూహాలు రూపొందించుకోవచ్చు’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అన్నారు.  

తక్షణ సాయం...: అసోచామ్‌ 
‘‘ఈ మహమ్మారిని ఎదుర్కొ నేందుకు ప్రధాని తీసుకున్న లాక్‌డౌన్‌ కొనసాగింపు నిర్ణయానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఎంఎస్‌ఎంఈ, లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరం’ అని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ పేర్కొన్నారు.

రిటైల్‌ నష్టం రూ.3.15 లక్షల కోట్లు: సీఏఐటీ 
నోయిడా: లాక్‌డౌన్‌ కాలంలో రిటైల్‌ వర్తకులు రూ.3.15 లక్షల కోట్ల మేర నష్టపోయారని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. దేశవ్యాప్తంగా 7 కోట్ల ట్రేడర్లు ఉండగా, వారిలో 1.5 కోట్ల మంది నిత్యావసర వస్తువుల విక్రయాల్లో ఉన్నారని, వీరిలోనూ 40 లక్షల మందే లౌక్‌డౌన్‌ కాలంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని తెలిపింది. దీనికి కారణం అధికారుల నుంచి పాస్‌లు అందకపోవడమేనని పేర్కొంది.   

సరైన నిర్ణయం... 
కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్న ప్రధాని నిర్ణయం సరైనదే. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరమే మెరుగైన భౌతిక టీకా. కఠిన నియంత్రణల అమలు అవసరం. లాక్‌డౌన్‌ మార్గదర్శకాల అమలులో ఏదైనా అలసత్వం ఉంటే పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. 
– కిరణ్‌మజుందార్‌ షా,బయోకాన్‌ చైర్‌పర్సన్‌  

జీతాలిచ్చేందుకు నిధుల్లేవు: ఎఫ్‌ఐఈవో
ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాలకు అనుమతించండి
లాక్‌డౌన్‌ కాలంలో ఎటువంటి కార్యకలాపాలు లేనందున ఏప్రిల్‌ నెలకు వేతనాలు చెల్లించేందుకు సూక్ష్మ, మధ్య, చిన్న స్థాయి పరిశమల (ఎంఎస్‌ఎంఈ) వద్ద తగినన్ని నిధుల్లేవని భారతీయ ఎగుమతుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) తెలిపింది. కనుక ప్రభుత్వం వెంటనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. తయారీ కేంద్రాల్లో, ముఖ్యంగా ఎగుమతి ఆధారిత యూనిట్లలో పాక్షికంగా అయినా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ శరత్‌కుమార్‌ కోరారు. ప్రధాని ప్రసంగంలో ఈ దిశగా నిర్ణయం వెలువడుతుందని ఆశించినట్టు చెప్పారు. నిర్ణీత వ్యవధిలో ఎగుమతుల ఒప్పందాలను అమలు చేయలేకపోతే ఆర్డర్ల రద్దు, పెనాల్టీలు, మార్కెట్‌ వాటా నష్టపోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు చెల్లించాలి...  
ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కోరింది. రుణ హామీల నుంచి సడలింపులు ఇవ్వాలని, రుణ చెల్లింపులపై మారటోరియం కొనసాగించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ, పలు ఇతర శాఖలకు సమర్పించిన వినతి పత్రాల్లో సీఐఐ సూచనలు చేసింది. ఎంఎస్‌ఎంఈలకు ఫండ్‌ ఆప్‌ ఫండ్‌ కోసం యూకే సిన్హా కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలని కోరింది. ‘‘పరిమిత వనరులతో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు కరోనా వైరస్‌ సాకులను తట్టుకుని నిలబడే శక్తి లేదు. సరఫరా వ్యవస్థల్లో ఎంఎస్‌ఎంఈలు ఎంతో ముఖ్యమైనవి. వీటి ఆరోగ్య పరిస్థితి అటు సరఫరా వ్యవస్థపై, పెద్ద కార్పొరేట్‌ కంపెనీలపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ సంక్షోభ సమయంలో ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా చర్యలు అవసరం’’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ బెనర్జీ కోరారు. 

ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం 
ఎంఎస్‌ఎంఈల రంగంలో ఒత్తిళ్లు నేపథ్యంలో వాటికి చెల్లించాల్సిన బకాయిలను కార్పొరేట్‌ సంస్థలు ముందుగానే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. లౌక్‌డౌన్‌ తర్వాత కార్యకలాపాల పునః ప్రారంభానికి వీలుగా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఫిక్కీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

లాక్‌ డౌన్‌ 2.0 జీడీపీ ‘జీరో’!
ముంబై: భారత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 234.4 బిలియన్‌ డాలర్లు (డాలర్‌ మారకంలో రూపాయి విలువలో దాదాపు రూ.17,60,000 కోట్లు) నష్టపోతుందని బ్రిటిష్‌ బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ అంచనావేసింది. తొలి మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 120 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.9,00,000 కోట్లు) నష్టం జరుగుతుందని తొలుత బార్‌క్లేస్‌ అంచనా వేసింది. అయితే తాజాగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు వల్ల ఈ అంచనాలను భారీగా 234.4 బిలియన్‌ డాలర్లకు పెంచింది. వెరసి 2020 క్యాలెండర్‌ ఇయర్‌లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని పేర్కొంది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధిరేటు స్వల్పంగా 0.8% ఉంటుందని తన తాజా పరిశోధనా పత్రంలో అభిప్రాయపడింది. తొలి 21 రోజుల లాక్‌డౌన్‌ సందర్భంలో దేశంలో 2020 క్యాలెండర్‌ ఇయర్‌లో 2.5 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసిన బ్రోకరేజ్‌ సంస్థ,  2020–21లో వృద్ధి 3.5% ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ శాతాలను వరుసగా ‘సున్నా’, ‘0.8 శాతాలుగా’ తగ్గించడం గమనార్హం.  

ఒక శాతం...ఇక్రా
లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో 2020–21లో భారత్‌ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా ఒకశాతం క్షీణత నమోదయ్యే వీలుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికాల తదుపరి పరిస్థితి ఏదైనా బాగుంటే, కనీసం ఒకశాతం వృద్ధి నమోదవుతుందనీ ఇక్రా పేర్కొంది. అయితే ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ఆర్థికవృద్ధి ఏకంగా –15 క్షీణతలో ఉంటుందని ఇక్రా అంచనావేయడం గమనార్హం. కాగా క్యాలెండర్‌ ఇయర్‌లో – 0.5 శాతం క్షీణ రేటు ఉంటుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషించింది.  మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) అసలు వృద్ధిలేకపోగా –6.1 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని అంచనావేసింది.

తీవ్ర మాంద్యంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్‌ 
కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి  జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 1930నాటి మాంద్యం తరువాత అంత దారుణ ఆర్థిక స్థితి ఇదని ఐఎంఎఫ్‌ విశ్లేషించింది.  2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ – 0.3 శాతం క్షీణత నమోదు చేసుకుంటుందని పేర్కొంది (జనవరిలో 6.3% అంచనా). భారత్‌కు సంబంధించి  2020  అంచనాలను 5.8 శాతం (జనవరి అంచనా) నుంచి 1.9 శాతానికి కుదించింది. అయితే 2021 భారత్‌  వృద్ధిరేటు 7.4 శాతం, చైనా 9.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంటాయని విశ్లేషించింది.

ఉద్దీపన  ప్యాకేజీ ఆశిస్తున్నాం: నాస్కామ్‌ 
ప్రభుత్వ నిర్ణయాన్ని నాస్కామ్‌ స్వాగతించింది. ‘‘దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్‌డౌన్‌ వైరస్‌ నియంత్రణకు సాయం చేసింది. వైరస్‌ నియంత్రణకు పటిష్ట విధానాన్ని రూపొందించుకోవడంతోపాటు లాక్‌డౌన్‌ తర్వాత ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై సన్నద్ధం అయ్యేందుకు మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయం తోడ్పడుతుంది. గ్రీజ్‌ జోన్లలో (కేసుల్లేని ప్రాంతాల్లో) ఆంక్షలను సడలించడం సంతోషకరం. ప్రభుత్వం వెంటనే ఆర్ధిక ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. దాంతో ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంపై దృష్టి సారించొచ్చు’’ అని నాస్కామ్‌ తన ప్రకటనలో పేర్కొంది.

ప్యాకేజీ ప్రకటించాలి... 
మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలన్న ప్రధాని  నిర్ణయానికి నా మద్దతు.  ఎన్నో చర్యలు, విధానాల ద్వారా ప్రభుత్వానికి మద్దతునిస్తున్న కార్పొరేట్‌ ఇండియా, ప్రభుత్వం నుంచి సరైన ఉద్దీపనల ప్యాకేజీని కోరుకుంటోంది. అది మన ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతునిస్తుంది. 
– పవన్‌ముంజాల్,హీరో మోటో చైర్మన్‌ 

మంచి ఆలోచన 
కరోనా వైరస్‌ కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు మంచి ఆలోచన. అమలు తీరును సమీక్షించడం ద్వారా ఏప్రిల్‌ 20 తర్వాత క్రమంగా కొన్ని ఆం క్షలను సడలించనున్నట్టు ప్రక టించడం ఆహ్వానించతగినది. 
– నవీన్‌ జిందాల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చైర్మన్‌ 

రియల్టీ ధరలు 20 శాతం తగ్గుతాయ్‌!
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. దీని ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలు 20 శాతం తగ్గుతాయని ప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అంచనా వేశారు. తక్కువ డిమాండ్, ఇన్వెంటరీ యూనిట్లు కారణంగా ఇప్పటికే రియల్టీ రంగం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో), కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) సంఘాలతో వీడియో సమావేశంలో డెవలపర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రియల్టీ ఖాతాల పునర్‌వ్యవస్థీకరణ కోసం ఎన్‌పీఏ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఖాతా 90 రోజుల పాటు సర్వీస్‌ చేయకపోతే అది ఎన్‌పీఏగా మారిపోతుంది. దీన్ని కనీసం 180 రోజులకు పొడిగించాలని ఆయన కోరారు.  

ప్యాకేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయండి: గడ్కరీ 
రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని పునరుద్దరించేందుకు అవసరమైన వన్‌ టైం రీస్ట్రక్చరింగ్‌ ప్యాకేజీకి సంబంధించిన అధ్యయన ప్రతిపాదనలను అందించాలని నిర్మాణ సంఘాలను కేంద్ర  మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. ఇప్పటివరకు  తీసుకున్న చర్యలు తగిన ఫలితాలివ్వలేదని, అందుకే ఈ రంగాన్ని పునరుద్దరించడానికి  సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

పరిమిత  పనులకు అనుమతించాలి: క్రెడాయ్‌ 
రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకు గడువు ముగిసేలోగా పూర్తి చేసేందుకు పరిమిత నిర్మాణ కార్యకలాపాలకు అనుమతించాలని క్రెడాయ్‌ నేషనల్‌ చైర్మన్‌ జక్షయ్‌ షా కోరారు.

ఎస్‌బీఐతో కలసి ఫండ్‌ 
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాజెక్టులకు నిధులు అందించేందుకు గాను ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఎస్‌బీఐ చైర్మన్‌తో మాట్లాడనున్నట్టు దీపక్‌ పరేక్‌ చెప్పారు. యస్‌ బ్యాంకులో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పెట్టుబడులు పెట్టినట్టుగానే, ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం కోసం సంయుక్త నిధి ఏర్పాటుకు ప్రయత్నించనున్నట్టు తెలిపారు. ఇది సాకారం అయితే ఐఎఫ్‌సీ వంటి విదేశీ సంస్థలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందన్నారు. 

మరిన్ని వార్తలు