కార్పొరేట్లకు రుణాలను కట్టడి చేయరాదు

26 Feb, 2018 02:15 IST|Sakshi

అలా చేస్తే నష్టం 

బ్యాంకులను పటిష్టపరచాలి

ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవాలి

పీఎన్‌బీ స్కామ్‌ నేపథ్యంలో కార్పొరేట్‌ రంగం సూచనలు

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.11,400 కోట్ల స్కామ్‌ వెలుగు చూసిన నేపథ్యంలో కార్పొరేట్లకు రుణాల జారీ తగ్గించరాదని దేశ కార్పొరేట్‌ రంగం హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధి రేటు పుంజుకోవాల్సిన తరుణంలో, అధిక వృద్ధి రేటు సాధించాల్సి ఉన్నందున ఈ చర్య అవసరమని సూచించింది.

ఆర్థిక మోసాలకు చెక్‌ పెట్టేందుకు మరింత పటిష్టమైన వ్యవస్థలను ప్రవేశపెట్టాలని, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం తన వాటాను క్రమంగా తగ్గించుకోవా లని కోరింది. ‘‘పీఎస్‌బీల్లో ప్రభుత్వం తన వాటాను క్రమంగా 33 శాతానికి తగ్గించుకోవాలి. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు, మెరుగైన పర్యవేక్షణ, బ్యాం కుల తనిఖీలను మెరుగుపరిచే రెండంచెల విధానాన్ని అసుసరించాలి. ఉత్తమమైన కార్పొరేట్‌ పరిపాలనా ప్రమాణాలను కొనసాగించాలి’’ అని సీఐఐ సూచించింది.  

సవాళ్లకు వెంటనే పరిష్కారం కనుగొనాలి
‘‘ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, పరిశ్రమ వెంటనే ఆర్థిక రంగంలోని వ్యవస్థాపరమైన సవాళ్లను వెంటనే పరిష్కరించాలి. బ్యాంకింగ్‌ రంగానికి మెరుగైన నిర్వహణ, నిర్వహణ సామర్థ్యాలు, బ్లాక్‌చెయిన్, డేటా అనలైటిక్స్‌ వంటి టెక్నాలజీల వినియోగం, పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవడం వంటివి అవసరం’’ అని సీఐఐ ప్రెసిడెంట్‌ శోభనా కామినేని పేర్కొన్నారు. పీఎన్‌బీ స్కామ్‌ నేపథ్యంలో కార్పొరేట్లకు రుణాల వితరణను పూర్తిగా నిలిపివేయడం చేస్తే అది పీఎస్‌బీల్లో ఉన్నత స్థాయిలోని వారిని నిరుత్సాహానికి గురిచేస్తుందని అసోచామ్‌ హెచ్చరించింది.

అనైతిక వ్యాపార సంస్థలు, అవినీతి అధికారులు కుమ్మక్కై పాల్పడే ఆర్థిక నేరాల కారణంగా పరిశ్రమకు నిధులు నిలిపివేసే పరిస్థితి రాకూడదని పేర్కొంది. ‘‘పీఎస్‌బీలను స్థిరీకరించడం ద్వారా ఉత్తమ ప్రమాణాలు, జవాబుదారీ, పారదర్శకతతో కూడిన పలు పటిష్ట బ్యాంకులను ఏర్పాటు  చేయాలి. రీక్యాపిటలైజేషన్‌తో ప్రభుత్వం తన వాటాను పెంచుకుంటోంది. కానీ, ప్రభుత్వం నిర్దే శించుకున్న విధంగా తన వాటాను 52 శాతానికి వెంటనే తగ్గించుకోవాలి’’ అని శోభ కామినేని సూచించారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని అసోచామ్‌ జనరల్‌ సెక్రటరీ డీఎస్‌ రావత్‌ అన్నారు. ‘‘ఏవో ఒకటి రెండు నల్ల గొర్రెలు మన ఆర్థిక వ్యవస్థను కూల్చేయలేవు. ఈ తరహా షాక్‌లను తట్టుకోగలదు. అయినప్పటికీ ఆ తరహా కుదుపులను వ్యవస్థాపరమైన సంస్కరణలతో నివారించాలి’’ అని రావత్‌ సూచించారు.  

మరిన్ని వార్తలు