ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...

21 Sep, 2019 06:07 IST|Sakshi

కార్పొరేట్, బ్యాంకింగ్‌  కరతాళ ధ్వనులు

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ  హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్‌ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం  సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి.

పెట్టుబడులు పెరుగుతాయి
అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది.       
– పీయూష్‌ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి

కార్పొకు ప్రేరణ
ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్‌ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి.
– ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి

చరిత్రాత్మక సంస్కరణ
ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్‌లో తయారీకి బలమైన ఊతమిస్తాయి.
– స్మృతి ఇరానీ.  మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి

ఇన్వెస్టర్లకు ఉత్సాహం...
ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది.
– రాజీవ్‌ కుమార్, నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌

సాహసోపేత నిర్ణయం
కార్పొరేట్‌ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే.  మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్‌ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్‌ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్‌బీఐ కలిసి పనిచేస్తుంది.
 – శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

ఆర్థిక రంగానికి ఊతం
ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్‌లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్‌నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది.
– అనిల్‌ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌

పోటీకి సై...
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది.
– ఉదయ్‌ కోటక్,  కోటక్‌ మహీంద్రా బ్యాంకు సీఈవో

వృద్ధికి దోహదం
వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్‌.
– కిరణ్‌ మజుందార్‌ షా, బయోకాన్‌ చైర్‌పర్సన్‌

తిరుగులేని సంస్కరణ...
కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్‌లో తయారీని పెంచుతుంది.
– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌

అపూర్వం, సాహసోపేతం
ఎంతో కాలంగా ఉన్న డిమాండ్‌. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది.
– విక్రమ్‌ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్‌

మరిన్ని వార్తలు