కార్పొరేట్లు గ్రామాల్ని దత్తత తీసుకోవాలి

29 Oct, 2014 04:44 IST|Sakshi
కార్పొరేట్లు గ్రామాల్ని దత్తత తీసుకోవాలి

గవర్నర్ నరసింహన్ పిలుపు

సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కంపెనీలు నైతిక విలువలకు కట్టుబడి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)ను నిర్వర్తించాలని, దాన్ని ఒక భాగంగా మలుచుకోవాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. ఎంతో కొంత సొమ్ము విరాళంగా ఇచ్చి దాన్ని సామాజిక బాధ్యత అనుకుంటే తప్పని హితవు పలికారు.

ఆ పద్ధతిని విడనాడి స్ఫూర్తివంతమైన, ప్రయోజకరమైన బాధ్యతను చేపట్టాలన్నారు. మంగళవారం రామకృష్ణ మఠంలో ‘సహయోజన’ పేరుతో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ అంశంపై జరిగిన సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై ఉద్వేగంగాప్రసంగించారు. సామాజిక బాధ్యత ఒక్కరోజు సంబంధం కాదని,. కంపెనీల కార్యకలాపాలు జరిగినన్ని రోజులు దీర్ఘకాలికంగా దాన్ని కొనసాగాలని స్పష్టం చేశారు.

స్వామి వివేకానంద బోధనలను ఆచరణలోకి తీసుకొచ్చి చిరకాలం నిలిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. ‘ఫండ్స్ ఇవ్వమని ఏ ఒక్కరికి చెప్పట్లేదు. ఆస్పత్రి నిర్మించి మంచి వైద్యులతో నడిపించండి. ఉచితంగా వైద్యం అందించండి. అలాగే రెండు రాష్ట్రాల ఏజెన్సీల్లో మెడికల్ కాలేజీలు నడపండి. సబ్సిడీపై విద్యార్థులకు చదువు అందించండి. ఇలాంటి వి ఎందుకు చేయడం లేదు? ప్రతి కార్పొరేట్ కంపెనీ 10 గ్రామాలను ఎందుకు దత్తత తీసుకోకూడదు. నిర్మల్ గ్రామం కాన్సెప్ట్ తీసుకుని పరిశుభ్రత, నీటి సరఫరా, మరుగుదొడ్లు, ఉచిత విద్య, సౌర విద్యుత్ వంటివి సమకూర్చండి. పల్లెల్ని అర్బన్ ఏరియాగా మార్చండి.

రామకృష్ణ మఠం ఉచిత ంగా వైద్య సేవలు అందిస్తోంది. అలాగే పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమం గ్రామాలకు మొబైల్ క్లినిక్‌ల ద్వారా ఉత్తమ వైద్యులతో సేవ చేస్తోంది. మరి ఈ బాధ్యతను కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు చేపట్టడం లేదు?’ అని సూటిగా ప్రశ్నించారు. శాంతా బయోటిక్స్ సీఎండీ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో పెట్టుబడి, లాభాలు, వ్యాపార విస్తరణతోపాటు ఎంత మందికి సేవ చేశారన్న అంశం కూడా ఉండాలని చెప్పారు.

పేదలు, రోగుల పట్ల దయాగుణం కాకుండా సేవాభావం కలిగి ఉండాలని వివేకానంద హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ స్వామి బోధామయానంద అన్నారు. రామకృష్ణమఠం అధ్యక్ష స్వామి జ్ఞానాధనంధజి, పెన్నార్ ఇండస్ట్రీస్ చైర్మన్ న్రుపేంద్ర రావు మాట్లాడారు. కార్యక్రమంలో వీఐహెచ్‌ఈ డిప్యూటీ డెరైక్టర్ ఏఎస్ మూర్తి, కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు