10 లక్షల డోసులతో సిద్ధం

15 May, 2020 02:39 IST|Sakshi
హెటిరో ల్యాబ్స్‌ ఎండీ బి.వంశీకృష్ణ

అనుమతులన్నీ వస్తే జూన్‌లోనే రెమ్డిసివిర్‌

‘సాక్షి’తో హెటిరో ల్యాబ్స్‌ ఎండీ వంశీకృష్ణ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌ 19 వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తున్న ఔషధం రెమ్డిసివిర్‌ సరఫరాకి సంబంధించి ఫేజ్‌–1లో ప్రభుత్వం ఆదేశాలొస్తే సత్వరం 10 లక్షల డోసులను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫార్మా దిగ్గజం హెటిరో ల్యాబ్స్‌ ఎండీ బి.వంశీకృష్ణ వెల్లడించారు. ఈ ఔషధాన్ని తయారు చేసి, విక్రయించేందుకు అమెరికన్‌ సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌తో హెటిరో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ఆయన ఈ విషయం చెప్పారు.

దేశీయంగా డిమాండ్‌ ఎంత స్థాయిలో ఉంటుందనేది కూడా ఇప్పుడే అంచనా వేయలేమని, ప్రభుత్వం చెప్పే దాన్ని బట్టే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. డిమాండ్‌ ఎలా ఉండబోతున్నప్పటికీ తమ వంతుగా ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు 10 లక్షల డోసులు అందించేందుకు సిద్ధమవుతున్నామని వంశీకృష్ణ చెప్పారు. లైసెన్సీలు అందరితో మాట్లాడి ఎంత మేరకు అవసరమవుతుందనేది బహుశా  రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం తెలియజేయొచ్చని భావిస్తున్నట్లు తెలియజేశారు.

ప్రస్తుతానికైతే దీన్ని అందుబాటులోకి తేవడంపైనే  దృష్టి సారిస్తున్నామన్నారు. దేశీయంగా ఈ ఔషధం వినియోగం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు కాబట్టి ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ప్రభుత్వం, ఐసీఎంఆర్, డీసీజీఐ చెప్పేదాన్ని బట్టి వినియోగం గురించి తెలుస్తుందన్నారు.  

త్వరలో అనుమతులు..  
డీసీజీఐకి తదుపరి రెండు వారాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోబోతున్నామని వంశీకృష్ణ తెలియజేశారు. ‘‘ఇది అత్యవసరమైన అంశం కాబట్టి డీసీజీఐ కూడా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయొచ్చని ఆశిస్తున్నాం. అవి వచ్చాక 7–10 పనిదినాల్లో దీన్ని అందుబాటులోకి తేగలం. జూన్‌లోనే దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ధర విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు’’ అని వంశీకృష్ణ వివరించారు.

సాధారణంగా ధరను నిర్ణయించుకునేందుకు తయారీ సంస్థలకు అధికారం ఉందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వపరమైన కొనుగోళ్ల కారణంగా దీనిపై ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. బహుశా రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. తాము ఉత్పత్తి చేసే ఈ ఔషధం పూర్తిగా మేకిన్‌ ఇండియా నినాదానికి అనుగుణంగా ఉంటుందని వంశీకృష్ణ తెలిపారు. రెమ్డిసివిర్‌ను విశాఖ, హైదరాబాద్‌ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నామని, పూర్తిగా ఇండియా ఉత్పత్తిగా దీన్ని చెప్పుకోవచ్చని చెప్పారాయన.

ఇతర దేశాలకూ ఎగుమతి..
ఒప్పందం ప్రకారం.. ఎగుమతి మార్కెట్లకు సంబంధించి ఆఫ్రికా, ఆసియా మొదలైన ఖండాల్లో మధ్య, తక్కువ స్థాయి ఆదాయాలుండే సుమారు 127 దేశాలకు దీన్ని ఎగుమతి చేయొచ్చని వంశీకృష్ణ చెప్పారు. ఇప్పటికే వాటిల్లో చాలా దేశాలకు తాము ఇతర ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఆయా మార్కెట్లలో గిలీడ్‌కు నేరుగా కార్యకలాపాలు లేవు. అలాంటి దేశాల్లో మా ద్వారా ఈ ఔషధం అందుబాటులోకి తేవాలని ఆ సంస్థ భావిస్తోంది’’ అని చెప్పారు.   

మరిన్ని వార్తలు