10శాతమే ఆక్యుపెన్సీ..

19 Mar, 2020 03:04 IST|Sakshi

భారత్‌కు వస్తున్న విమానాల్లో అరకొర ప్రయాణికులే

శంషాబాద్‌ నుంచి దేశీయ,అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేత

దుబాయ్, బ్యాంకాక్‌ మినహా ఇతర దేశాలకు అరకొర సర్వీసులే

బుధవారం ఒక్క రోజే 27 దేశీయ సర్వీసులు నిలిపివేత.. పోలండ్‌లో

చిక్కుకున్న 50 మంది భారతీయులు అందులో ఆరుగురు తెలుగు వాళ్లు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ విశ్వరూపంతో విమానయానం డోలాయమానంలో పడింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్‌ విమాన రంగాన్ని ఓ రకంగా కుదేలు చేసింది. ఈ ప్రభావం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా పడింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలతో నిత్యం సందడిగా కనిపించే ఎయిర్‌పోర్టు ప్రస్తుతం వెలవెలబోతుంది. విమానయాన సంస్థలు సేవలను నిలిపివేయడంతో వివిధ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాల్లో సగానికి పైగా రద్దయ్యాయి.

ప్రతిరోజూ ఇక్కడి నుంచి 38 అంతర్జాతీయ విమానాలు.. దుబాయ్, మలేసియా, కువైట్, మస్కట్, ఖతర్, యూఏఈ, ఒమన్, బ్యాంకాక్, హాంకాంగ్‌ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. అయితే కోవిడ్‌ ప్రభావంతో దుబాయ్, బ్యాంకాక్‌ మినహా ఇతర దేశాలకు ప్రస్తుతం విమాన సర్వీసులు నిలిపివేశారు. తాజాగా లండన్‌ సహా యూరప్‌ దేశాలకు కూడా విమాన సేవలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా దేశాలకు ఇక్కడి నుంచి వెళ్లే కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు దేశాలకు రాకపోకలు సాగించే విమానాల్లో ప్రస్తుతం 15 మాత్రమే నడుస్తున్నాయి. 

ఖాళీగా.. డీలాగా..
కోవిడ్‌ ప్రభావంతో రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే వారి విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గాయి. అలాగే వివిధ దేశాల నుంచి విమాన సర్వీసులు నిలిపివేయడంతో అక్కడే చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో దాదాపు 90 శాతం టికెట్లు రద్దు చేసుకుంటుండటంతో విమానాలు ఖాళీగా తిరుగుముఖం పడుతున్నాయి. పది రోజుల క్రితం వరకు ఆగ్నేయాసియా దేశాలు, గల్ఫ్‌ దేశాలకే పరిమితమైన కోవిడ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఆయా దేశాలకు వెళ్లాలనుకుంటున్న తెలుగు ప్రజలు ప్రయాణాలను నిరవధికంగా వాయిదా వేసుకుంటున్నారు. ఎప్పుడు వెళ్లాలనే షెడ్యూల్‌ కూడా ఖరారు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో టికెట్ల రద్దుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఆయా దేశాల నుంచి వస్తున్న విమానాల్లో కేవలం 10 శాతం సీట్లు మాత్రమే నిండుతున్నట్లు విమానయాన వర్గాలు తెలిపాయి. 

పోలాండ్‌లో తెలు‘గోడు’..
పోలాండ్‌ రాజధాని వార్సా ఎయిర్‌పోర్టులో 50 మంది భారతీయులు చిక్కుకుపోయారు. భారత్‌ రావడానికి ‘లాట్‌’ఎయిర్‌లైన్స్‌లో టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు నిరాశే మిగిలింది. యూరోప్‌ దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేస్తూ మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమాన సర్వీసును నిలిపివేస్తున్నట్లు లాట్‌ సంస్థ ప్రకటించింది. దీంతో స్వదేశానికి రావాలకున్న భారతీయులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఆరుగురు తెలుగువారు ఉన్నట్టు వార్సా ఎయిర్‌పోర్టులో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన నగేశ్‌ ‘సాక్షి’కి తెలిపారు. వార్సా దాదాపుగా షట్‌డౌన్‌ కావడం, యూనివర్సిటీలు మూసివేయడంతో భయానక వాతావరణం నెలకొందని, విమాన సర్వీసులను కూడా నిలిపివేయడంతో తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలాండ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడామని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారని నగేశ్‌ చెప్పారు.  

దేశీయ ప్రయాణం కూడా అంతంతే..
సాధ్యమైనంత వరకు విమాన ప్రయాణాలను తగ్గించుకోవాలని ప్రభుత్వం హెచ్చరించడంతో దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పడిపోయింది. శంషాబాద్‌ నుంచి ప్రతిరోజూ 389 దేశీయ విమానాలు దేశంలోని ప్రదేశాలకు రాకపోకలు సాగిస్తాయి. కోవిడ్‌ నేపథ్యంలో వీటిలో 60 సర్వీసులను ఆయా సంస్థలు నిలిపివేయగా, షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య సరిపడా లేదనే కారణంతో బుధవారం ఒక్క రోజే 27 విమానాలను రద్దు చేశారు. 

చదవండి:
ఆ బ్లడ్‌ గ్రూపు వాళ్లు తస్మాత్‌ జాగ్రత్త!

ప్లీజ్‌ .. పెళ్లికి అనుమతించండి..

రాష్ట్రంలో హై అలర్ట్‌
 

మరిన్ని వార్తలు