అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..

17 Feb, 2020 06:21 IST|Sakshi

కరోనా వైరస్‌ పరిణామాలు కీలకం

గురువారం ఎఫ్‌ఓఎంసీ, ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి

ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం

మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు

ముంబై: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) తాజా పరిణామాలు, ఏజీఆర్‌ అంశం వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌ గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. చైనాలోని వూహాన్‌లో ఉద్భవించిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న నేపథ్యంలో పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి.

ఈ వైరస్‌ మరణాల సంఖ్య ఇప్పటికే 1,500 దాటిపోవడం, వూహాన్‌లో అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి అందించాలనుకున్న ఇద్దరు జర్నలిస్ట్‌ల ఆచూకీ తెలియకుండా పోవడం వంటి పరిణామాలు సోమవారం ట్రేడింగ్‌పై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను అడ్డుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తేల్చి చెప్పిన కారణంగా మార్కెట్‌ గమనానికి ఇది అత్యంత కీలకంగా మారిపోయిందని ట్రేడింగ్‌ బెల్స్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సంతోష్‌ మీనా అన్నారు. ఇప్పటికే 28 దేశాలకు వ్యాపించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్‌ సూచీల ప్రయాణానికి అతి పెద్ద సవాలుగా మారిందని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అన్నారు.

క్రూడ్‌ ధర పెరిగింది
ముడి చమురు ధరలు గడిచిన 5 ట్రేడింగ్‌ సెషన్లలో నాలుగు రోజులు లాభపడ్డాయి. వీక్‌ ఆన్‌ వీక్‌ ఆధారంగా న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 5 శాతం మేర పెరిగింది. శుక్రవారం 1.76 శాతం లాభపడి 57.33 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్‌ కారణంగా క్రూడ్‌ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఇది ఇలానే కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 71.36 వద్దకు చేరుకుంది. బడ్జెట్‌ తరువాత నుంచి 71.10–71.50 శ్రేణిలోనే కదలాడుతోంది. అవెన్యూ సూపర్‌మార్ట్‌ (డీమార్ట్‌) స్టేక్‌ సేల్‌లో ఎఫ్‌ఐఐ నిధులు ఉండనున్నందున ఈ వారంలో రూపాయి మారకం విలువకు మద్దతు లభించే అవకాశం ఉందని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కరెన్సీ రీసెర్చ్‌ రాహుల్‌ గుప్తా విశ్లేషించారు.  

ఆర్థిక అంశాల ప్రభావం..
ఫెడ్‌ జనవరి పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఈనెల 20న (గురువారం) ప్రకటించనుంది. ఇదే రోజున ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడికానున్నాయి. అమెరికా తయారీ పీఎంఐ, సర్వీసెస్‌ పీఎంఐ 21న వెల్లడికానున్నాయి.

ఫిబ్రవరిలో ఎఫ్‌పీఐ నిధులు రూ. 24,617 కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ. 24,617 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఫిబ్రవరి 1–14 కాలంలో వీరు స్టాక్‌ మార్కెట్లో రూ. 10,426 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ. 14,191 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది.

ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులే..
మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం (21న) దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. 

మరిన్ని వార్తలు