‘తీపి’ తగ్గింది!!

12 May, 2020 00:33 IST|Sakshi

దేశవ్యాప్తంగా 50 శాతం తగ్గిన చక్కెర అమ్మకాలు

నష్టాలకుతోడు లాక్‌డౌన్‌ కష్టాలు

కోలుకోవడం కష్టమే.. కంపెనీలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నష్టాల ఊబిలో ఉన్న చక్కెర కంపెనీలకు లాక్‌డౌన్‌ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. డిమాండ్‌ లేకపోవడం, సరఫరా సమస్యలు పరిశ్రమకు కొత్తగా తోడయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద షుగర్‌ నిల్వలు పేరుకుపోయాయి. ఆదాయం తగ్గడం, కార్మికుల వేతనాలు, వడ్డీలు.. వెరసి చేతిలో ఉన్న మూలధనం కాస్తా ఆవిరైందని కంపెనీలు అంటున్నాయి. ఇప్పట్లో ఈ రంగం కోలుకోవడం కష్టమేనని కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 22 లక్షల టన్నుల చక్కెర అమ్ముడవుతోంది. ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం గత సీజన్లో భారత్‌లో 172 మిల్లులు చక్కెర ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత సీజన్లో ఈ సంఖ్య 139కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నష్టాల్లోనే కంపెనీలు..
బస్తా (100 కిలోలు) చక్కెర ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రూ.4,000 పైమాటే. మిల్లుల వద్ద విక్రయ ధర రూ.3,400 ఉంది. అంటే ఒక్కో బస్తాపై కంపెనీలు రూ.600 నష్టం మూటగట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీలకైతే∙రూ.700 వరకు నష్టం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 100 కిలోల బస్తాకు మిల్లు వద్ద అమ్మకం ధర రూ.4,200 ఉంటేనే కంపెనీలు మనగలవని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒకట్రెండు కంపెనీలు మినహా మిగిలినవన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. శానిటైజర్ల తయారీని కొన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికమేన న్నారు.

రికవరీ ఇప్పట్లో కష్టమే..: కౌలు ధర అధికంగా ఉండడం, కూలీ ఖర్చులు తడిసిమోపెడు అవడం, ఉత్పత్తికి ధర లేకపోవడంతో చెరకు పంట వేయడానికి రైతులు ముందుకు రావడం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశంలో అప్పులు లేని కంపెనీలు ఒకట్రెండు మాత్రమే ఉంటాయి. వైరస్‌ భయానికి ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కార్మికులు రావడం లేదు. లాక్‌డౌన్‌ తదనంతరం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల కోత, వేతనాల కుదింపు తప్పదు. మిల్లు వద్ద విక్రయ ధర పెరిగితే తప్ప ఈ పరిశ్రమ రికవరీ ఇప్పట్లో కనపడడం లేదు’ అని చెప్పారు.

అక్టోబర్‌ నాటికి..: దేశంలో 2019 అక్టోబరు 1 నాటికి 110 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయి. 2019–20 (అక్టోబర్‌–సెప్టెంబర్‌) క్రషింగ్‌ కాలంలో దేశవ్యాప్తంగా 270 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఈ ఏడాది 50–60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి  కావచ్చని పరిశ్రమ  భావించగా, ఇప్పటికి సుమారు 30 లక్షల టన్నులే ఎగుమతైంది. అంతర్జాతీయంగా తక్కువ ధర, సరఫరా సమస్యల కారణంగా 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఆగిపోనుందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి చక్కెర నిల్వలు దేశంలో సుమారు 75 లక్షల టన్నులు ఉంటాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు