ఆరంభ లాభాలు ఆవిరి

16 Apr, 2020 05:16 IST|Sakshi

కొనసాగుతున్న కరోనా కల్లోలం

వృద్ధి అంచనాలకు ఐఎంఎఫ్‌ కోత

310 పాయింట్ల నష్టంతో 30,380కు సెన్సెక్స్‌

69 పాయింట్లు తగ్గి 8,925కు నిఫ్టీ

ఆరంభ లాభాల జోష్‌ను మన మార్కెట్‌ చివరి వరకూ కొనసాగించలేకపోయింది. కరోనా వైరస్‌ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఆర్థిక స్థితిగతులు మరింత అధ్వానం కాగలవన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) 1.9%కి తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ఠానికి పడిపోవడం, ముడి చమురు ధరలు 4% మేర పతనమవటం, లాక్‌డౌన్‌ను పొడిగించడం.... ప్రతికూల ప్రభావం చూపాయి. రోజంతా 1,346 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 310 పాయింట్ల నష్టంతో 30,380 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 267 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 8,925 వద్దకు చేరింది.  

సమృద్ధిగానేవర్షాలు.. తప్పని నష్టాలు...!!
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయని, ఎలాంటి లోటు ఉండదని వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 1 శాతానికి తగ్గింది. ఈ రెండు సానుకూలాంశాలతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 878 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో మధ్యాహ్నం తర్వాత మన సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. 1930 నాటి మహా మాంద్యం తర్వాత ఈ ఏడాదే ఆర్థిక పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయని ఐఎంఎఫ్‌ వ్యాఖ్యానించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 468 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయాయి.  ఇంట్రాడే గరిష్టం నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 1,188 పాయింట్ల మేర నష్టపోయింది. ఇక  ఆసియా మార్కెట్లు 1–2 శాతం నష్టాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు›కూడా 3–4% నష్టాల్లో ముగిశాయి.  

► కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్‌ 6.2 శాతం నష్టంతో రూ.1,173 వద్ద ముగిసింది.   
► లాక్‌డౌన్‌ నుంచి వ్యవసాయ రంగ కార్యకలాపాలను మినహాయించడంతో సంబంధిత షేర్లు లాభపడ్డాయి. దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రో కెమికల్స్‌ 11%, రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ 11%, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ 8 శాతం ఎగబాకాయి.

ఆల్‌టైమ్‌ కనిష్టానికి రూపాయి
డాలర్‌తో పోలిస్తే 76.44కి డౌన్‌
ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. అంతర్జాతీయంగా డాలరు బలపడటం తదితర పరిణామాలతో రూపాయి మారకం విలువ బుధవారం గణనీయంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 17 పైసలు క్షీణించి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 76.44 వద్ద క్లోజయ్యింది. డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టంగా ఉండటం ..  రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. దీంతో పాటు ఇటు దేశీ, అటు ప్రపంచ ఎకానమీలపై కరోనా   ఆందోళన కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా బలహీనంగా ఉన్నట్లు వివరించారు.

బుధవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే్చంజీలో రూపాయి ట్రేడింగ్‌ గత ముగింపుతో పోలిస్తే పటిష్టంగా 76.07 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.99 గరిష్ట స్థాయితో పాటు 76.48 డాలర్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 76.44 వద్ద ముగిసింది. మే 3 దాకా లాక్‌డౌన్‌ కొనసాగించడంతో మరిన్ని సమస్యలు తప్పవనే భయాలు నెలకొనడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్టు (కమోడిటీ, కరెన్సీ) జతిన్‌ త్రివేది తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు