కరోనా మందు : మరిన్ని చిక్కుల్లో రాందేవ్

24 Jun, 2020 19:49 IST|Sakshi

కరోనిల్ కిట్  వివాదం

రాందేవ్, పతంజలి బాలకృష్ణపై  ఫిర్యాదు

సాక్షి, పట్నా : కరోనా కట్టడికి ఆయుర్వేద ఔషధం కరోనిల్ కిట్ అంటూ అట్టహాసంగా ప్రకటించిన  పతంజలి అధినేత, యోగా గురు రాందేవ్ ఇపుడు చట్టపరమైన  ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.   సంస్థ కన్వీనర్ రాందేవ్,  చైర్మన్ బాలకృష్ణపై  కేసు నమోదు చేయాలంటూ  సామాజిక కార్యకర్త తమన్నా హష్మి ఫిర్యాదు  చేశారు. 

కోవిడ్-19 నివారణకు “కరోనిల్ ” వంద శాతం పనిచేస్తుందని ప్రకటించిన రాందేవ్, బాలకృష్ణపై  మోసం, నేరపూరిత కుట్ర, ఇతర అభియోగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం తమన్నా హష్మి ఫిర్యాదు చేశారు. ప్రాణాంతక మహమ్మారికి మందు అంటూ లక్షలాది మంది ప్రజలను తప్పు దారి పట్టించి, వారి జీవితాలను  ప్రమాదంలోకి నెట్టివేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ  బ్రేక్
అటు పతంజలి  వివాదాస్పద కరోనిల్ మందుకు సంబంధించి  ఆ సంస్థ వాదనలో వాస్తవాలు,  శాస్రీయ అధ్యయనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ  మంగళవారం బహిరంగంగా ప్రకటించింది. తమ పూర్తి పరిశీలన జరిగేంతవరకు ఈ ఔషధానికి సంబంధించి ఎలాంటి ప్రచారం చేయవద్దని పతంజలి సంస్థను ఆదేశించింది. అలాగే ఈ డ్రగ్ అనుమతులపై వివరాలను కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటిసులిచ్చింది. (పతంజలి కరోనా మందుకు బ్రేక్!)

ఉత్తరాఖండ్ ప్రభుత్వ స్పందన
ఈ నోటీసులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. పతంజలి తన 'కరోనిల్ మెడిసిన్'  అనుమతికోసం దరఖాస్తును సమర్పించినప్పుడు "కరోనావైరస్" గురించి ప్రస్తావించలేదని  ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ లైసెన్స్ ఆఫీసర్ వై ఎస్ రావత్ బుధవారం స్పష్టం చేశారు. రోగనిరోధక శక్తి పెంచే ఔషధంగా మాత్రమే పేర్కొంటూ జూన్ 10న దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. దగ్గు, జ్వరం నివారణ మందుగానే తాము లైసెన్స్‌ ఆమోదించామని తెలిపారు. కోవిడ్-19 కిట్ తయారు చేయడానికి వారికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ, ఆ సంస్థకు నోటీసులు పంపించనున్నామని చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది.

కాగా సుమారు 150 ఔషధ మూలికలతో పతంజలి రీసెర్చ్ సెంటర్, ఎన్ఐఎంఎస్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జైపూర్) సంయుక్త కృషితో కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేశామని రాందేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు