మహమ్మారితో ఐటీ కుదేలు..

3 Apr, 2020 16:27 IST|Sakshi

బెంగళూర్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే ఐటీ దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు క్షీణిస్తుందని అంచనా వేస్తున్నాయి. కోవిడ్‌-19తో జనజీవనం స్తంభించడమే కాకుండా వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో ఐటీ ఎగుమతులపైనా పెనుప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో అమెరికా, యూరప్‌ క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాల్లో కోత విధిస్తుండటం దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లపై ప్రతికూల ప్రభావం పడనుందని ఐటీ విశ్లేషకులు భావిస్తున్నారు.

రానున్న ఆరునెలల్లో ఐటీ రంగంలో రాబడి 2 నుంచి 7 శాతం తగ్గుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించిందని ఓ వార్తాసంస్ధ వెల్లడించింది. వైరస్‌ ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో జాప్యాలు వంటి కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసాల్లో రాబడి గణనీయంగా తగ్గవచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషించారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ ఈ ఏడాది ప్రధమార్ధంలో వృద్ధి రేటు మందగమనాన్ని ఎదుర్కొంటాయని అంచనా వేశారు.

ఐటీ కంపెనీలు ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని, ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రభావంతో రాబడి నష్టం వాటిల్లుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌కు చెందిన దేవాంగ్‌ భట్‌ పేర్కొన్నారు. కోవిడ్‌-19 ప్రభావంతో వ్యాపారం దెబ్బతినే క్రమంలో వృద్ధి రేటును యాక్సెంచర్‌ 6-8 శాతం నుంచి 3-6 శాతానికి కుదించిన బాటలోనే భారత ఐటీ కంపెనీలు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రవాణాపై ఆంక్షలు సైతం ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణమవుతున్నాయి. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఎయిర్‌లైన్స్‌, రిటైల్‌, హైటెక్‌, ఫైనాన్షియల్‌, తయారీ రంగాలకు చెందిన క్లయింట్ల నుంచి వచ్చే వ్యాపారం వైరస్‌ మహమ్మారి కారణంగా దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా కేంద్రస్ధానమైన చైనాలో ఆర్థిక మందగమనం కూడా భారత ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

చదవండి : పీఎం కేర్స్ ఫండ్‌ : నిర్మలా సీతారామన్ సాయం

మరిన్ని వార్తలు