క్రూడ్‌ క్రాష్‌..

21 Apr, 2020 04:20 IST|Sakshi

చరిత్రలోనే కనీవిని ఎరుగని కనిష్టస్థాయి

మైనస్‌ 28 డాలర్లకు డబ్లూటీఐ మే నెల కాంట్రాక్టు ధర

లాక్‌డౌన్‌లతో డిమాండ్‌ ఢమాల్‌; పేరుకుపోతున్న నిల్వలు...

ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుతున్న పరిస్థితులు

కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర పాతాళానికి పడిపోయింది. న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో లైట్‌ స్వీట్‌ క్రూడ్‌(డబ్లూటీఐ) బేరల్‌ మే నెల కాంట్రాక్ట్‌ ధర సోమవారం ఒకానొక దశలో కుప్పకూలి... మైనస్‌ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది. చరిత్రలో క్రూడ్‌ ధర ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడడం ఇదే మొదటి సారి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో చమురుకు డిమాండ్‌ భారీగా తగ్గిపోయింది. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో తమ నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే.  నిల్వలు భారీగా పేరుకుపోతున్న ధోరణి, కనుచూపుమేర కనిపించని ఆర్థిక రికవరీ నేపథ్యంలో మళ్లీ ముడిచమురు ధరలు ఎప్పుడు పుంజుకుంటాయోనని ఉత్పత్తిదారులు గగ్గోలు పెడుతున్నారు.  

భౌగోళిక ఉద్రిక్తతల నుంచి కరోనా, ప్రైస్‌వార్‌ వరకూ...
నిజానికి 2020 తొలి నాలుగు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసింది. 2020 జనవరిలో అమెరికా  దాడుల్లో ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ మరణించడం, దీనితో భౌగోళిక ఉద్రిక్త పరిణామాలతో క్రూడ్‌ ధర ఒక్కసారిగా ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే  ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, తర్వాత  కరోనా ప్రభావంతో రష్యా–సౌదీ అరేబియాల మధ్య చోటుచేసుకున్న ఈ  ‘ధరల యుద్ధం’తో క్రూడ్‌  ధర పతనమవుతూ వచ్చింది.

ఫలించని ఒపెక్‌ ఒప్పందాలు..
క్రూడ్‌ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా  పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు కుదిరిన ఒక డీల్‌ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్‌ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలపై నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాయి.  ఆయా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడుతుందన్న అంచనాలు వెలువడ్డాయి.

అయితే, డిమాండ్‌ పెంచేందుకు ఒపెక్, అమెరికాలు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని కేవలం 10 రోజులకే స్పష్టమైపోయింది. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయిన పరిస్థితి నెలకొనడం ఇక్కడ ఒక కారణమైతే,  ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   ఒకవేళ ఉత్తర అమెరికన్‌ సంస్థలు 5 మిలియన్‌ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్‌ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని విశ్లేషణ.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉందని అంచనా.

7.4 బిలియన్‌ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్‌ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి అమెరికాలోని ఒక్లహోమాలో క్రూడ్‌ నిల్వల హబ్‌లో నిల్వల పరిస్థితి దాదాపు దాని పూర్తి సామర్థ్యానికి చేరుకుంటోందని వార్తలు వస్తున్నాయి.  ఇక్కడ వర్కింగ్‌ స్టోరేజ్‌ సామర్థ్యం 76 మిలియన్‌ బేరళ్లయితే, 55 మిలియన్‌ బేరళ్లకు ఈ స్టోరేజ్‌కి చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే,  కొనుగోలు చేసిన క్రూడ్‌ ఆయిల్‌ను తీసుకువెళ్లాలని తమ కస్టమర్లపై చమురు ఉత్పత్తిదారులు ఒత్తిడి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుందన్నది విశ్లేషణ. అంతేకాదు అవసరమైతే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇచ్చిమరీ నిల్వలు తగ్గించుకోవాల్సి రావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.

ఎలియట్‌వేవ్‌ సిద్ధాంతం ప్రకారం వచ్చే దశాబ్దంలో ఎప్పడోకప్పుడు ముడిచమురు ధర 4–10 డాలర్ల స్థాయికి పడిపోవచ్చు. మళ్లీ ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని (147.67 డాలర్లు) చూడాలంటే
చాలా ఏళ్లే పడుతుంది.

– 2009లో ఎలియట్‌వేవ్‌ ఇంటర్నేషనల్‌
వ్యవస్థాపకుడు రాబర్ట్‌ ప్రెషెర్‌ అంచనా

1999 జనవరిలో క్రూడ్‌ కనిష్ట స్థాయి: 11.72 డాలర్లు
2008 జూన్‌ క్రూడ్‌ ఆల్‌టైమ్‌ గరిష్టం:  147.67 డాలర్లు
2020 ఏప్రిల్‌ 20న క్రూడ్‌ కనిష్ట స్థాయి: మైనస్‌ 28 డాలర్లు

మరిన్ని వార్తలు