బ్రాండెడ్ చెప్పులకు క్రేజ్...

5 Apr, 2014 01:30 IST|Sakshi
బ్రాండెడ్ చెప్పులకు క్రేజ్...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెప్పులు అనగానే పాదరక్షలు అన్న భావన ఇప్పుడు తొలగిపోయింది. ప్రత్యేకతను చూపించుకోవడానికి ఒక సాధనంగానూ మారిపోయాయి. పురుషులు సాధారణంగా ఆఫీసుకు ఒకటి, రోజూ వేసుకోవడానికి ఒకటి ఇలా ఏటా రెండు జతలు కొంటే.. యువతులైతే ఏకంగా నాలుగు జతలకు తక్కువ కాకుండా మెయింటెయిన్ చేస్తున్నారట. ఇంట్లో, ఆఫీసుకు, వాకింగ్‌కు, షాపింగ్‌కు, శుభకార్యానికి ప్రత్యేకంగా చెప్పులను కొంటున్నారు. కస్టమర్లు పాదరక్షల విషయంలో నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందుకోసం బ్రాండెడ్ వైపు మళ్లుతున్నారని ప్రముఖ కంపెనీ ప్యారగాన్ అంటోంది. బ్రాండెడ్ ధరలు తగ్గడం కూడా మరో కారణమని చెబుతోంది.

 రంగులమయం..
 చెప్పుల అడుగు భాగంలో నలుపు రంగును మాత్రమే కస్టమర్లు ఆదరిస్తున్నారు. పై భాగంలో ఫ్యాన్సీ రంగులున్న వాటిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పురుషులైతే నలుపుతోపాటు సంప్రదాయ రంగులు కోరుతున్నారు. మహారాష్ట్రలో నలుపు రంగు సాండల్స్ అధికంగా అమ్ముడవుతున్నాయి. ఇక సైజు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 10, 11 నంబరు చెప్పులకు ఎక్కువ డిమాండ్. దీనికి కారణం ఇక్కడివారి పాదం పెద్దగా ఉండడమే. పశ్చిమ బెంగాల్‌లో 8వ నంబరు అమ్మకాలే అధికం. 9, 10 నంబరు అతి స్వల్పం. మొత్తంగా సగటు వినియోగం భారత్‌లో 2.1 జతలు. పశ్చిమ దేశాల్లో 11 జతలుంది.  

 ధరలు తగ్గాయి కాబట్టే..
 పాదరక్షల అమ్మకాల్లో 60 శాతం వాటా రూ.250 లోపుండే వెరైటీలదే. బ్రాండెడ్ కంపెనీలు కూడా ఈ ధరలో వివిధ వెరైటీలను ఆఫర్ చేస్తున్నాయి. మూడు నాలుగేళ్ల క్రితం బ్రాండెడ్ చెప్పుల ఖరీదు దాదాపు రూ.350 నుంచి ఉండేది. ఇప్పుడు రూ.129 నుంచి లభిస్తున్నాయని ప్యారగాన్ పాలిమర్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ థామస్ మణి తెలిపారు. బ్రాండెడ్ కంపెనీలు ధరలు తగ్గించడంతో అవ్యవస్థీకృత రంగ కంపెనీల ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతోందని పేర్కొన్నారు. కస్టమర్లు సైతం మన్నికకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టైల్, సౌకర్యం, అందుబాటు ధర ఈ మూడు అంశాలు కీలకమయ్యాయని వివరించారు. చైనాలో కార్మికులకయ్యే వ్యయం అధికమవుతుండడంతో ఆ దేశం నుంచి చవక పాదరక్షల దిగుమతి తగ్గుతోందని వెల్లడించారు.

 రూ.27,000 కోట్ల మార్కెట్..
 చెప్పులు, సాండల్స్, స్పోర్ట్స్, ఫార్మల్, లెదర్ షూస్ అన్నీ కలిపి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలో దేశంలో పాదరక్షల పరిశ్రమ రూ.27 వేల కోట్లుంటుందని అంచనా. వ్యవస్థీకృత రంగంలో సాండల్స్, చెప్పుల పరిశ్రమ 20 శాతం వృద్ధి రేటుతో రూ.6-7 వేల కోట్లుంది. పాలీ యురెథేన్‌తో(పీయూ) తయారైన పాదరక్షలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తడి ఉన్నప్పటికీ జారకుండా ఉండడం వీటి ప్రత్యేకత. 2013-14లో 3.2 కోట్ల జతల పీయూ చెప్పులను ప్యారగాన్ విక్రయించింది. ఇక పిల్లల పాదరక్షల మార్కెట్ రూ.2,500 కోట్లుండొచ్చని సమాచారం. పెద్దల కంటే పిల్లల పాదరక్షలే ఖరీదెక్కువ.

 సమంత.. బ్రాండ్ అంబాసిడర్
 పాదరక్షల తయారీలో ఉన్న ప్యారగాన్ సినీ తార సమంతను ప్రచార కర్తగా నియమించింది. మహిళలకు రోజువారీ వినియోగం కోసం రూపొందించిన సోలియా శ్రేణి చెప్పులకు మూడేళ్లపాటు ఆమె ప్రచారం చేస్తారు. 100 డిజైన్లు ఆఫర్ చేస్తున్నామని, వీటి ధరలు రూ.129-199 మధ్య ఉన్నాయని కంపెనీ తెలిపింది. 2013-14లో కంపెనీ రూ.1,375 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. 12.92 కోట్ల జతల చెప్పులను విక్రయించింది. ఇందులో 35% వాటా మహిళల పాదరక్షలదేనని మార్కెటింగ్ ఈడీ నవీన్ థామస్ శుక్రవారమిక్కడ  తెలిపారు. ఫార్మల్, లెదర్ షూస్ విభాగంలోకి రెండేళ్లలో ప్రవేశిస్తామని చెప్పారు. ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు, ఈ-కామర్స్ భవిష్యత్ ప్రణాళికలని వెల్లడించారు. కంపెనీ నెలకు 35 కొత్త డిజైన్లను ప్రవేశపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కంపెనీకి 45 శాతం మార్కెట్ వాటా ఉంది.

మరిన్ని వార్తలు