భారత్‌లో సర్వర్ల ఏర్పాటు తప్పనిసరి

1 May, 2018 00:46 IST|Sakshi

కొత్త టెలికం విధానంలో నిబంధనలు?

న్యూఢిల్లీ: భారతీయుల డేటాకు మరింత భద్రత కల్పించే దిశగా డేటా హోస్టింగ్‌ సంస్థలన్నీ దేశీయం గా సర్వర్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం చర్యలు తీసుకోనుంది. దీనికోసం 2022 దాకా గడువిస్తూ మే 1న ప్రకటించే కొత్త టెలికం విధానం ముసాయిదాలో నిబంధనలు పొందుపర్చనుంది.

ఇందులో దేశీ యూజర్లకు సంబంధించిన మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ మొదలైన వివరాలన్నీ దేశీయంగానే ఉండేలా... సర్వర్లను ఇక్కడే ఏర్పాటు చేయాలని టెలికం సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు ప్రభుత్వం సూచించే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యం మొదలైనవి అందరికీ సులభతరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డేటా ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో భాగంగానే ఈ మేరకు సూచనలు చేయొచ్చని పేర్కొన్నారు.

డేటా భద్రతకు లోకలైజేషన్‌ కీలకం: పేటీఎం సీవోవో కిరణ్‌ వాసిరెడ్డి  
దేశంలో డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కన్సూమర్‌ డేటా గోప్యతకు, భద్రతకు పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లందరూ డేటా లోకలైజేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని, దీనిపై ఇన్వెస్ట్‌ చేయాలని పేటీఎం పేర్కొంది. ‘‘భారతదేశపు పేమెంట్‌ వ్యవస్థల భద్రతకు డేటా లోకలైజేషన్‌ కీలకం.

దేశంలో కస్టమర్లకు పేమెంట్‌ సేవలను అందించాలనుకుంటున్న ప్రతి సంస్థ ఈ నిబంధనను కచ్చితంగా అనుసరించాలి’’ అని పేటీఎం సీవోవో కిరణ్‌ వాసిరెడ్డి తెలిపారు

మరిన్ని వార్తలు