సృజనాత్మక ఎలక్ట్రానిక్స్‌ అడ్డా ‘ఎర్హా’

14 Oct, 2017 01:05 IST|Sakshi

ప్రపంచ దేశాల్లోని ఇన్నోవేటివ్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల విక్రయం

6 నెలల్లో కార్పొరేట్, వ్యక్తిగత బహుమతుల విభాగంలోకి

ఈ ఏడాది ముగిసేలోగా రూ.30 కోట్ల నిధుల సమీకరణ

‘స్టార్టప్‌ డైరీ’తో ఎర్హా.కామ్‌ సీఈఓ మణికాంత్‌ జైన్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  ప్రపంచంలో అతి చిన్న మొబైల్‌.. తైవాన్‌కు చెందిన ‘టాక్సీ’. దీని పొడవు జస్ట్‌ క్రెడిట్‌ కార్డు సైజు అంతే!. మరి అతి తేలికైన సెల్‌ఫోన్‌? రష్యాకు చెందిన ‘ఇలారి నానోఫోన్‌ సీ’. దీని బరువు 30 గ్రాములు మాత్రమే ఇక దుబాయ్‌కు చెందిన ‘మిసూట్‌ డ్యూయల్‌ సిమ్‌ కేస్‌’తో ఒకే మొబైల్‌ను ఏకకాలంలో ఆండ్రాయిడ్, ఐఫోన్‌ వెర్షన్లలో వాడొచ్చు. నిజానికివన్నీ జనరల్‌ నాలెడ్జి ప్రశ్నలు కాదు.  ‘ఎర్హా.కామ్‌’లో దొరికే వస్తువులు!!.

అవును.. ప్రపంచంలో అత్యంత సృజనాత్మకమైన గాడ్జెట్స్‌ దొరికే వేదిక ఇదే మరి! ఆన్‌లైన్‌ వేదికపై అంతర్జాతీయ బ్రాండ్లను, అది కూడా ఇన్నోవేటివ్‌ ఎలక్ట్రానిక్స్‌ను మాత్రమే విక్రయించడం ఎర్హా ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ సీఈఓ మణికాంత్‌ జైన్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

‘‘పంజాబ్‌లో ప్రాథమిక విద్య పూర్తయ్యాక.. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేశా. తాతముత్తాతల నుంచే గార్మెంట్‌ వ్యాపారం మాది. చదువుకున్న వాడిని కావటంతో గార్మెంట్స్‌ క్రయవిక్రయాల కోసం విదేశాలకు వెళ్లేవాణ్ణి. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ అంటే ఇష్టం కనక ఎక్కడికెళ్లినా ఏదో ఒక గాడ్జెట్‌ కొనేవాణ్ణి. దాన్ని చూసి స్నేహితులు, కుటుంబీకులు బాగుందని తీసుకునేవాళ్లు. లేకపోతే మళ్లీ ఏ దేశమైనా వెళ్లినప్పుడు అలాంటి గాడ్జెట్‌ తీసుకురమ్మని డబ్బులు ఇచ్చేవాళ్లు. ఓ సందర్భంలో... విదేశాల్లోని ఇన్నోవేషన్‌ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్‌ వంటివి ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తే ఎలా ఉంటుందనిపించింది’’! అలా 2014లో ఎర్హా.కామ్‌కు బీజం పడింది.

1,500 కేటగిరీల్లో 20 వేల ఉత్పత్తులు..: ప్రస్తుతం ఎర్హా.కామ్‌లో అమెరికా, రష్యా, జర్మనీ, హాంకాంగ్, కొరియా, తైవాన్, చైనా, దుబాయ్‌ దేశాల్లోని ఇన్నోవేటివ్‌ గాడ్జెట్స్, యాక్ససరీలుంటాయి. ఆయా ఉత్పత్తుల కోసం ఆయా దేశాల్లోని తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మొబైల్స్, యాక్ససరీలు, చార్జర్లు, కేబుల్స్‌ ఇలా సుమారు 1,500 కేటగిరీల్లో 20 వేలకు పైగా ఉత్పత్తులున్నాయి. ఏడాది కాలంలో మరో వెయ్యి ప్రోడక్ట్‌లను జత చేయనున్నాం. ఉత్పత్తుల నిల్వ కోసం ఢిల్లీలో 3,500 చ.అ.ల్లో గిడ్డంగి ఉంది. ఉత్పత్తుల ధరలు రూ.150 నుంచి రూ.15,900 వరకున్నాయి.

హైదరాబాద్‌ నుంచి 15 శాతం అమ్మకాలు..
ప్రస్తుతం మాకు 50 వేల మంది కస్టమర్లున్నారు. ఫేస్‌బుక్‌లో 2.50 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. నెలకు 5 వేల ఆర్డర్లొస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి సుమారు 15 శాతం వ్యాపారం వస్తోంది. స్థానిక కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించడం కోసం వచ్చే ఏడాదిలో హైదరాబాద్‌లో సర్వీసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఆర్డరిచ్చిన 7 పని దినాల్లో డెలివరీ చేస్తాం. ఇందుకోసం పలు కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.

రూ.30 కోట్ల నిధుల సమీకరణ..
ఎర్హాలో కొన్న ఉత్పత్తులకు ఆయా కంపెనీల గ్యారంటీ, వారంటీతో పాటు మేం 6 నెలల గ్యారంటీని అందిస్తాం. 8 ఏళ్ల వ్యాపారంలో రీప్లేస్‌మెంట్‌కు వచ్చిన ఉత్పత్తులు 2 శాతం కంటే తక్కువే. ఇప్పటివరకు మా ఒప్పందం కంపెనీలకు రూ.20 కోట్ల గ్రాస్‌ మర్చండేజ్‌ వాల్యూ (జీఎంవీ) చేసిచ్చాం. ఇందులో మా ఆదాయం 30 శాతం వరకుంటుంది. రెండేళ్లలో జీఎంవీని రూ.100 కోట్లకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఈ ఏడాది డిసెంబర్‌లోగా రూ.30 కోట్ల నిధుల సమీకరణ పూర్తి చేస్తాం’’ అని మణికాంత్‌ వివరించారు.

మరిన్ని వార్తలు