అప్పు తీసుకోకపోవటం..  గొప్పేం కాదు!!

16 Apr, 2018 01:23 IST|Sakshi

అలాంటివారికి రుణాలివ్వటానికి బ్యాంకుల విముఖత

క్రెడిట్‌ స్కోరుంటేనే  ఇస్తామంటున్న రుణ సంస్థలు

క్రెడిట్‌ కార్డుల జారీకీ ఇదే అర్హత; కొత్తవారికి సమస్యలు

ప్రత్యామ్నాయ మార్గాలే  ఇందుకు పరిష్కారం

సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు, పీ2పీ లెండింగ్‌ సంస్థలున్నాయ్‌

శ్రీధర్‌ ప్రైవేటు ఉద్యోగి. మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఉన్నంతలో పొదుపు చేస్తూ పోతుంటాడు కనక పెద్దగా అప్పులేమీ లేవు. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే స్నేహితుల దగ్గర చేబదులు తీసుకుని... చెప్పిన సమయానికి తిరిగిచ్చేస్తాడు. కాబట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర రుణాలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. కాకపోతే చెల్లెలి పెళ్లి చేయటానికి కాస్త ఎక్కువ మొత్తమే అవసరం పడింది. ఇప్పటిదాకా ఏ లోనూ తీసుకోలేదు కాబట్టి... ఏ బ్యాంకయినా ఇస్తుంది కదా అని ధీమాగా వెళ్లి ఓ బ్యాంకులో దరఖాస్తు చేశాడు. కానీ బ్యాంకు నో చెప్పింది. దీనికి వాళ్లు చెప్పిన కారణమేంటో తెలుసా..? ‘‘మీరు ఇప్పటిదాకా ఏ లోనూ తీసుకోలేదు. కనక మీకు క్రెడిట్‌ హిస్టరీ లేదు. మరి ఏం చూసి మీకు రుణమిస్తాం?’’ అని అవాక్కవటం శ్రీధర్‌ వంతయింది.

క్రెడిట్‌ స్కోరు లేనివారికి క్రెడిట్‌ కార్డులు, రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. నిజానికి రుణమిస్తేనే కదా క్రెడిట్‌ స్కోరు అంటూ ఏర్పడేది? అన్న సందేహం రావొచ్చు. నిజమే కానీ, బ్యాంకుల తీరు అలాగే ఉంది. అందులోనూ ఉద్యోగంలో చేరి పదేళ్లు, పదిహేనేళ్లు గడిచిన వారు కనక క్రెడిట్‌ హిస్టరీ లేకుండా రుణాలకోసం దరఖాస్తు చేస్తే బ్యాంకులు నో చెప్పేస్తున్నాయి. ‘ఈవై ఫిన్‌టెక్‌ అడాప్షన్‌ ఇండెక్స్‌ 2017’ నివేదిక ప్రకారం బ్యాంకులు అసంపూర్తి క్రెడిట్‌ స్కోరు లేదా క్రెడిట్‌ స్కోరు లేనివారికి రుణాలిచ్చేందుకు నో అంటున్నాయి. ఇలా తిరస్కరణకు గురయ్యే వారు ప్రధానంగా విద్యార్థులే. డిజిటల్‌ రుణాలిచ్చే సంస్థ స్టాష్‌ఫిన్‌ గణాంకాల ప్రకారం చూస్తే... జనాభాలో 6–7 శాతం మందే రుణ సౌకర్యం పొందగలుగుతున్నారు. పట్టణాల్లో యువతీ, యువకుల్లో క్రెడిట్‌ కార్డులున్నవారు 1.7 శాతమే. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్కోరు అంశంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టడం అవసరం.

క్రెడిట్‌ హిస్టరీ ఉండి తీరాలా..?: కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు వేతన ఖాతాలను ప్రారంభిస్తారు. ఆ ఖాతా ఉన్న బ్యాంకులు సహజంగానే క్రెడిట్‌ కార్డును ఆఫర్‌ చేస్తాయి. అలాంటపుడు కాదనకుండా దాన్ని పరిశీలించడం మంచిది. ఎందుకంటే వేతన ఉద్యోగి కాబట్టే క్రెడిట్‌ స్కోరు లేకున్నా ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. కానీ ఈ మధ్య మార్పు వచ్చింది. బ్యాంకులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు క్రెడిట్‌ సుధార్‌ సహ వ్యవస్థాపకుడు అరుణ్‌ రమణమూర్తి చెప్పారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే వారికి సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు తీసుకోవడం మరో మార్గం. ఇది సాధారణ క్రెడిట్‌ కార్డే. కానీ, బ్యాంకులు కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేయించుకుని ఆ డిపాజిట్‌లో నిర్ణీత శాతం లిమిట్‌తో క్రెడిట్‌ కార్డుల్ని జారీ చేస్తుంటాయి. అంటే మీ డబ్బునే పరోక్షంగా క్రెడిట్‌ కార్డు రూపంలో ఇవ్వడం. దీనివల్ల బ్యాంకులకు రిస్క్‌ ఉండదు. కనుక క్రెడిట్‌ స్కోరును చూడవు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు డిపాజిట్‌లో 85 శాతాన్ని క్రెడిట్‌ లిమిట్‌గా ఇస్తోంది. ఈ కార్డు తీసుకున్నాక రెగ్యులర్‌గా వాడుతూ స్కోరు బిల్డ్‌ చేసుకుంటే దాన్ని 8–9 నెలల తరవాత బ్యాంకులు సాధారణ క్రెడిట్‌ కార్డుగా మార్చే అవకాశముంది.

స్కోరు పెంచుకోవటం ఇలా...: సహజంగా రుణాలు తీసుకోని వారికి, క్రెడిట్‌ కార్డుల్లేని వారికి క్రెడిట్‌ స్కోరు ఉండదు. అలాగే, రుణాలు ఎగ్గొట్టిన వారికి కూడా క్రెడిట్‌ స్కోరు పడిపోతుంది. ఇలా జరిగితే వెంటనే కార్డు ఇచ్చిన సంస్థను సంప్రతించి బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాలి. ఇలా చేస్తే ఆ తర్వాత వారి క్రెడిట్‌ స్కోరును తిరిగి పెంచుకునే అవకాశం చిక్కుతుంది. చిన్న స్థాయి వినియోగ రుణాలు, సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులను వినియోగించడం ద్వారా స్కోరు పెంచుకోవచ్చు. వీటిని పరిమితంగా వాడుతూ సకాలంలో చెల్లింపులు చేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి డిఫాల్ట్‌ కాకుండా చూసుకోవాలి. 

డిజిటల్‌ రుణ వేదికలున్నాయ్‌
రుణం, క్రెడిట్‌ కార్డు ఇవ్వటానికి బ్యాంకులు నో చెబితే ఉన్న మరో మార్గం డిజిటల్‌ వేదికపై రుణం పొందడం. వీటినే పీ2పీ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 32 పీ2పీ రుణ సంస్థలు పనిచేస్తున్నాయి. ఐ–లెండ్, లోన్‌ట్యాప్, ఎర్లీ శాలరీ, పోసెన్స్, మనీట్యాప్, క్యుబెరా ఈ తరహా సంస్థలే.  క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నవారికి, అస్సల్లేని వారికి కూడా ఇవి రుణ సౌకర్యం ఏర్పాటు చేస్తాయి. రుణాలకు కొత్తయిన వారికి, స్కోరు 600లోపు ఉన్న వారికి, అస్సలు స్కోరు లేని వారికి ఈ సంస్థలు రుణాలిస్తున్నాయి. పీ2పీ సంస్థలు రుణాలిచ్చే ముందు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా దరఖాస్తుదారు అర్హతలను అంచనా వేస్తుంటాయి. అలాగే, దరఖాస్తు దారుల సోషల్‌ నెట్‌వర్క్‌ ప్రొఫైల్స్, ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లను కూడా ట్రాక్‌ చేసి వారికి సంబంధించిన ఖర్చులు, అలవాట్ల సమాచారాన్ని, పొదుపు, పెట్టుబడుల వివరాలను రాబడతాయి. బ్యాంకులు సాధారణంగా దరఖాస్తు దారుల క్రెడిట్‌ స్కోరుపైనే దృష్టి పెడుతుంటే, పీ2పీ తరహా సంస్థలు నాలుగడుగులు ముందుకు వేసి ఆయా వ్యక్తులకు సంబంధించిన చెల్లింపుల సామర్థ్యాన్ని తెలుసుకుంటున్నాయి. అయితే, ఇక్కడ  వడ్డీ 12%– 36%  శ్రేణిలో ఉంటుంది.  

మరిన్ని వార్తలు