చిట్టీలుంటే.. రుణాలిస్తాం!

2 Jun, 2018 00:53 IST|Sakshi

తనఖా లేకుండా రూ.35 లక్షల వరకూ లోన్‌

చిట్‌ ఫండ్‌ కంపెనీలతో క్రెడ్‌రైట్‌ ఒప్పందం

2 నెలల్లో కేరళ, ఏపీలకు విస్తరణ

రూ.9 కోట్ల నిధుల సమీకరణ పూర్తి

‘స్టార్టప్‌ డైరీ’తో క్రెడ్‌రైట్‌ ఫౌండర్‌ నీరజ్‌ భన్సాల్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యక్తిగత అవసరం కావొచ్చు.. సంస్థ కోసం కావచ్చు.. ప్రతి నెలా చిట్టీలు వేయటం మనకు తెలిసిందే. అవసరానికి డబ్బులొస్తాయనో లేక పొదుపు చేస్తే వడ్డీ కలిసొస్తుందనో చిట్‌ఫండ్‌లలో సభ్యులుగా చేరతాం.

మరి, నెలనెలా మీరు వేసే చిట్టీలే మీకు రుణాన్నిస్తే? చిట్టీ కాలం ముగిసే లోపు నెల వాయిదాతో పాటూ అసలూ తీరిపోతే? ఇదే వ్యాపారసూత్రంగా ఎంచుకుంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ క్రెడ్‌రైట్‌. దేశంలోని చిట్‌ఫండ్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సభ్యులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.35 లక్షల వరకూ రుణాన్నిస్తోంది. మరిన్ని వివరాలను క్రెడ్‌రైట్‌ కో–ఫౌండర్‌ నీరజ్‌ భన్సాల్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ చిట్‌ఫండ్స్‌ జనరల్‌ సెక్రటరీ టీఎస్‌ శివరామకృష్ణన్‌తో కలిసి 2014లో రూ.1.5 కోట్ల పెట్టుబడితో క్రెడ్‌రైట్‌ను ప్రారంభించాం. అమెరికాలోని రొటేటింగ్‌ సేవింగ్స్‌ అండ్‌ క్రెడిట్‌ అసోసియేషన్‌ (రోస్కా) తరహాలోనే చిట్‌ఫండ్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), కిరాణా షాపులు, ఇతరత్రా వ్యాపారస్తులకు డేటా ఆధారిత రుణాన్నివ్వటమే మా ప్రత్యేకత.

చిట్‌ విలువలో 80% రుణం..
ప్రస్తుతం ఢిల్లీకి చెందిన బలుస్సెరీ, చెన్నైకి చెందిన మాయావరం, బెంగళూరుకు చెందిన ఇందిరానగర్, హైదరాబాద్‌కు చెందిన సప్తవందన చిట్‌ఫండ్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. వీటికి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రోల్లో వందల బ్రాంచీలున్నాయి. లక్ష నుంచి రూ.35 లక్షల వరకు రుణాలిస్తాం. చిట్‌ విలువలో 80 శాతం వరకూ రుణం వస్తుంది. ప్రతి నెలా కేవలం వడ్డీ మాత్రమే ఉంటుంది. చిట్‌ పాడుకున్నపుడు అసలును కట్టాల్సి ఉంటుంది. ఏడాదికి 18% వడ్డీ ఉంటుంది.

రూ.10 కోట్ల రుణాల మంజూరు..
పేరు, చిరునామా, చిట్‌ఫండ్‌ వివరాలు, ఇతరత్రా డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయ్యాక.. 24 గంటల్లో రుణం మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 150 మంది చిట్‌ఫండ్‌ దారులకు రూ.10 కోట్ల రుణా లిచ్చాం. రూ.10 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నవాళ్లు 35% ఉంటారు. ఈ ఏడాది ముగిసేలోగా రూ.100 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యించాం. రుణగ్రహీత నుంచి రుణంలో 1–2% ప్రాసెసింగ్‌ ఫీజు ఉంటుంది.

2 నెలల్లో కేరళ, ఏపీలకు విస్తరణ..
ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. మా మొత్తం ఆదాయంలో తెలంగాణ వాటా 15 శాతం. కర్ణాటక, మహారాష్ట్రల వాటా 35 శాతం. రెండు నెలల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సేవలను ప్రారంభిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో 5 చిట్‌ఫండ్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నాం. మార్గదర్శి, కపిల్‌ చిట్‌ఫండ్లతో చర్చిస్తున్నాం. ఈ ఏడాది ముగింపులోగా ఒప్పందం పూర్తవుతుంది.

రూ.9 కోట్ల నిధుల సమీకరణ..: 2017–18లో రూ. కోటి ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.10 కోట్లకు చేరాన్నది లక్ష్యం. ‘‘ప్రస్తుతం కంపెనీలో ఏడుగురు ఉద్యోగులున్నారు. త్వరలోనే దీన్ని 30కి చేర్చనున్నాం. ఇటీవలే యువర్‌నెస్ట్, ఆసియాన్‌ వెంచర్‌ల్యాబ్స్‌ ద్వారా రూ.9 కోట్లు సమీకరించాం’’ అని నీరజ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు