ల్యాంకో ఇన్‌ఫ్రాకు డిఫాల్ట్‌ రేటింగ్‌: క్రిసిల్‌

5 Jul, 2017 01:28 IST|Sakshi
ల్యాంకో ఇన్‌ఫ్రాకు డిఫాల్ట్‌ రేటింగ్‌: క్రిసిల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  రుణ సంక్షోభంలో చిక్కుకున్న నిర్మాణ రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ (ఎల్‌ఐటీఎల్‌)కు రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తాజాగా డిఫాల్ట్‌ ’డి’ రేటింగ్‌ ఇచ్చింది. రుణాల చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతుండటాన్ని ఈ రేటింగ్‌ ప్రతిఫలిస్తుంది. తగినంత నగదు లేకపోవడమే రుణాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమని క్రిసిల్‌ పేర్కొంది. ల్యాంకో ఇన్‌ఫ్రాతో పాటు అది ఆస్ట్రేలియాలో తలపెట్టిన గ్రిఫిన్‌ కోల్‌ వెంచర్‌ ఆర్థిక, వ్యాపార పరిస్థితులను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్‌ వివరించింది.

భారీ స్థాయిలో రుణాలు పేరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రాపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులను గత నెలలో ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ముందుకు ఈ అంశం చేరింది. 2012–13 నుంచి ల్యాంకో ఇన్‌ఫ్రా రుణాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.  గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ల్యాంకో ఇన్‌ఫ్రా నగదుయేతర రుణభారం రూ. 3,221 కోట్లుగాను, నగదు రూప రుణభారం రూ. 8,146 కోట్లుగాను ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఎల్‌ఐటీఎల్‌ రూ. 1,635 కోట్ల ఆదాయంపై రూ. 890  నికర నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ. 445 కోట్లు.

మరిన్ని వార్తలు