పదేళ్లలో రూ.110 లక్షల కోట్లకు పెరగాలి

27 Nov, 2019 05:34 IST|Sakshi

రాష్ట్రాల ఇన్‌ఫ్రా వ్యయాలపై క్రిసిల్‌ విశ్లేషణ..! 

న్యూఢిల్లీ: భారత్‌ నిర్దేశించుకున్న భారీ మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలను సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే దశాబ్దంలో (2021–2030) ఇన్‌ఫ్రాపై వ్యయాలను రూ. 110 లక్షల కోట్లకు పెంచాల్సి ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది. ఈ దశాబ్దంలో ఇన్‌ఫ్రాపై చేసే మొత్తం రూ. 77 లక్షల కోట్ల పెట్టుబడుల్లో దాదాపు 41 శాతం రాష్ట్రాలదే ఉండనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇయర్‌బుక్‌ 2019 పుస్తకావిష్కరణ సందర్భంగా క్రిసిల్‌ ఈ విషయాలు వెల్లడించింది.

రూ.235 లక్షల కోట్లు అవసరం
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రాబోయే దశాబ్దంలో రూ. 235 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేసింది. అలాగే స్థూల దేశీయోత్పత్తి వృద్ధి సగటున 7.5 శాతం ఉండాలని, జీడీపీలో 6 శాతం పైగా ఇన్‌ఫ్రా వ్యయాలు ఉండాలని పేర్కొంది. రాష్ట్రాలు చేసే వ్యయాల్లో మూడింట రెండొంతుల భాగం .. రవాణా, సాగునీటి సదుపాయం, ఇంధనం వంటి అయిదు రంగాలపైనే ఉంటోంది. ఇన్‌ఫ్రా పెట్టుబడుల్లో రాష్ట్రాల వాటా సుమారు 50 శాతం స్థాయికి చేరాల్సిన అవసరం ఉందని క్రిసిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడ్వైజరీ ప్రెసిడెంట్‌ సమీర్‌ భాటియా తెలిపారు.

పెట్టుబడుల తీరు ఆధారంగా రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా క్రిసిల్‌ వర్గీకరించింది. ముందు వరుసలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా.. మధ్య స్థాయిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా ఉన్నాయి. మధ్య స్థాయిలో ఉన్న రాష్ట్రాలు.. నిలకడగా పెట్టుబడులు కొనుసాగించడం ద్వారా వృద్ధి సారథులుగా ఎదిగే అవకాశం ఉందని క్రిసిల్‌ పేర్కొంది. ఎదుగుతున్న రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లపై రుణభారం పెరుగుతున్నందున పెట్టుబడుల సామర్థ్యం పరిమితంగా ఉండొచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు