వొడాఫోన్‌​ ఐడియాకు మరోషాక్‌

25 Jan, 2020 19:15 IST|Sakshi

డౌన్‌ గ్రేడ్‌ రేటింగును కొనసాగించిన క్రిసిల్‌

బీబీబీ నుంచి బీబీబీ మైనస్‌కు తగ్గింపు

సాక్షి,న్యూఢిల్లీ: ఏజీఆర్‌ వివాదంతో  కష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియాకు మరో చిక్కొచ్చి పడింది.  ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తాజాగా వొడాఫోన్‌ ఐడియా డౌన్‌  రేటింగ్‌ను కొనసాగించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్‌) బకాయిలను చెల్లించాల్సిన అవకాశం ఉన్నందున కంపెనీ ఆర్ధిక రిస్క్ ప్రొఫైల్‌లో గణనీయమైన క్షీణత ఉంటుందని అంచనా  వేసింది. ఏజీఆర్‌ వివాదానికి ముందు బీబీబీగా ఇచ్చిన ర్యాంకును బీబీబీ మైనస్‌కు తగ్గించింది. వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 3,500 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లపై క్రిసిల్ తన రేటింగ్‌ను తగ్గించిందని తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి  రూ .53,038 కోట్లు చెల్లించాల్సి వుంది. 

కాగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలను జనవరి 23నాటికి చెల్లించాల్సిందేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. దీంతో ఈ గడువులోగా బకాయిలు చెల్లించలేమన్న టెల్కోలు ఈ తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ సుప్రీంలో టెల్కోలు పిటిషన్‌ను దాఖలు చేశాయి.  దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు  వచ్చే వారం వాదనలు విననుంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా బలవంతంగా బాకీల వసూలుకు చర్యలు తీసుకోరాదని టెలికం శాఖ(డాట్‌) నిర్ణయించింది. లైసెన్సింగ్‌ ఫైనాన్స్‌ పాలసీ వింగ్‌ ఈ మేరకు అన్ని విభాగాలకు ఆదేశాలు పంపించింది.

చదవండి : ఏజీఆర్‌ బకాయిలపై టెల్కోలకు ఊరట,   
జియో ఏజీఆర్‌ బకాయిలు చెల్లింపు

మరిన్ని వార్తలు