-

కోవిడ్‌-19 ఎఫెక్ట్‌ : దేశీ ఐటీకి గడ్డుకాలం

24 Apr, 2020 20:37 IST|Sakshi

ముంబై : కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో దేశీ టెక్నాలజీ పరిశ్రమ కుదేలవుతోంది. వైరస్‌ ధాటికి ఆర్డర్లు, ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో భారత ఐటీ రంగంలో రాబడి వృద్ధి పదేళ్ల కనిష్ట స్ధాయిలో రెండు శాతం వరకూ తగ్గనుంది. ఐటీ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో లాభాలు తగ్గుముఖం పడతాయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. లాక్‌డౌన్‌ల నేపథ్యంలో కొత్త ఒప్పందాలు జరగకపోవడంతో పాటు ప్రస్తుత ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.

భారత ఆర్థిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలుస్తూ 40 లక్షలకు పైగా ఉద్యోగాలను సమకూరుస్తున్న దేశీ ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమ మహమ్మారి ప్రభావానికి లోనైతే ఉపాధి రంగంపై అది పెను ప్రభావం చూపుతుంది. కరోనా వైరస్‌ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న క్రమంలో దేశీ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, విప్రో సహా పలు కంపెనీలు వార్షిక గైడెన్స్‌లు ఇచ్చే పద్ధతిని విరమించాయి.

చదవండి : ‘టీ వర్క్స్‌’ టెక్నాలజీతో ఎయిరోసోల్‌ బాక్సులు 

మార్చి- మే మధ్య సహజంగా కొత్త ఒప్పందాలు జరుగుతుంటాయని, ఈసారి వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు అమలవుతున్న క్రమంలో ఈ ప్రక్రియ నిలిచిపోయిందని, మరోవైపు ప్రస్తుత కాంట్రాక్టుల కొనసాగింపుపైనా అనిశ్చితి నెలకొందని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేథి పేర్కొన్నారు. ఆదాయాల్లో క్షీణత ఐటీ కంపెనీల లాభాలను ప్రభావితం చేస్తుందని, మరోవైపు ఆయా కంపెనీలు డిజిటల్‌ ప్రాజెక్టులపై వెచ్చిస్తున్న క్రమంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని క్రిసిల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ రాజేశ్వరి కార్తిగేయన్‌ విశ్లేషించారు.

మరిన్ని వార్తలు