వచ్చేసారి లాభాలు అంతంతే!

11 Mar, 2017 00:14 IST|Sakshi
వచ్చేసారి లాభాలు అంతంతే!

రెండంకెల స్థాయిని దాటని ఆదాయ వృద్ధి
పెరిగే కమోడిటీ ధరలతో మార్జిన్లపై ఒత్తిడి
2017–18లో దేశీ కార్పొరేట్లపై క్రిసిల్‌ నివేదిక


ముంబై: అంచనాలకు తగ్గట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల లాభదాయకత 100 బేసిస్‌ పాయింట్లు పెరిగాక.. వచ్చేసారి (2017–18)లో మాత్రం వృద్ధి అంతంతమాత్రంగానే ఉండగలదని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది. ఇక ఆదాయాల వృద్ధి కూడా క్రమంగానే ఉండొచ్చని ఇండియా అవుట్‌లుక్‌ నివేదికలో తెలిపింది. సింగిల్‌ డిజిట్‌ ఆదాయ వృద్ధి రేటు ఇకపై సర్వసాధారణం కాగలదని,  వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు ఎనిమిది శాతం మేర పెరగవచ్చని వివరించింది. ఫలితంగా మరోసారి కార్పొరేట్లు రెండంకెల స్థాయి వృద్ధిని సాధించలేకపోవచ్చని తెలిపింది. పెరుగుతున్న కమోడిటీల ధరల కారణంగా ఆపరేటింగ్‌ మార్జిన్లపై ఒత్తిడి తప్పదని అంచనా వేసింది. అన్నీ అనుకూలిస్తే.. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ), టెలికం.. సిమెంట్‌ తదితర రంగాల్లో కన్సాలిడేషన్, తక్కువ వడ్డీ రేట్లు మొదలైనవి వృద్ధికి ఊతమిచ్చేందుకు తోడ్పడగలిగే సానుకూల అంశాలని క్రిసిల్‌ వివరించింది.

జీడీపీకి డిమాండ్‌ ఊతం..
పెద్ద నోట్ల రద్దు కారణంగా తగ్గిన డిమాండ్‌ క్రమక్రమంగా మళ్లీ మెరుగుపడగలదని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఇది తోడ్పడగలదని క్రిసిల్‌ అంచనా వేసింది. దీంతో 2017 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉండే వృద్ధి రేటు 2018 ఆర్థిక సంవత్సరంలో పుంజుకుని 7.4 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. సాధారణ వర్షపాతం, ఓ మోస్తరు ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు మొదలైనవి కూడా జీడీపీ పెరుగుదలకు దోహదపడే అవకాశం ఉందని క్రిసిల్‌ పేర్కొంది. అన్ని రంగాలకు ప్రయోజనం చేకూర్చే జీఎస్‌టీ అమలు కీలకమని వివరించింది. ఇక విధానపరమైన చర్యలు, తీవ్రమైన పోటీ మొదలైనవి ఎదుర్కొంటున్న రంగాల్లో (టెలికం, సిమెంట్‌) కన్సాలిడేషన్‌ చోటు చేసుకోవడం కూడా సానుకూల పరిణామమేనని క్రిసిల్‌ తెలిపింది.

ఆటోమొబైల్, ఐటీ కీలకం..
ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్ల సారథ్యంలో ఆటోమొబైల్‌ రంగం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్వీసులు, నిర్మాణ రంగం (ముఖ్యంగా ఇన్‌ఫ్రా సంబంధమైన ప్రాజెక్టులు) వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాల వృద్ధికి కీలకంగా ఉంటాయని క్రిసిల్‌ తెలిపింది. అయితే, గడిచిన అయిదేళ్లతో పోలిస్తే సిమెంటు, ఉక్కు రంగాల్లో పెట్టుబడులు... రానున్న అయిదేళ్లలో తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది. డీమోనిటైజేషన్‌ ప్రభావాలు తగ్గుతున్నప్పటికీ.. రియల్‌ ఎస్టేట్, సిమెంట్, ఉక్కు తదితర రంగాలపై ఒత్తిళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగవచ్చునని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఒకవైపు ధరలు మరోవైపు అమ్మక పరిమాణాల తగ్గుదలతో కుదేలవుతున్న సిమెంటు రంగం పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే 2018–19 ఆర్థిక సంవత్సరం దాకా ఆగక తప్పదని వివరించింది.

ఏడాది కిందట మెల్లిగా మొదలైన కమోడిటీ ధరల పెరుగుదల.. అంతిమంగా వాటిని వినియోగించే సంస్థల నిర్వహణ మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని క్రిసిల్‌ రీసెర్చ్‌ అనలిస్టులు అంచనా వేశారు. ప్రైవేట్‌ పెట్టుబడులు ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చని తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేసుకుని ఉండటం, డిమాండ్‌ మాత్రం అంతంతమాత్రంగానే పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా పెట్టుబడి ప్రణాళికలు 2018–19 ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉందని అనలిస్టులు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు