జీడీపీ వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్

12 Dec, 2016 15:09 IST|Sakshi
జీడీపీ వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్

2016-17లో 6.9%కి తగ్గింపు 
ద్రవ్యోల్బణం తగ్గుతుందని వెల్లడి

 ముంబై: నోట్ల రద్దు కారణంగా ఆర్థిక రంగం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్... దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో వేసిన అంచనా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. అదే సమయంలో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువగా 4.7 శాతంగా ఉంటుందని క్రిసిల్ తెలిపింది. డీమోనటైజేషన్ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరి కొంత సమయం పడుతుందని, వినియోగం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం కూడా దిగివస్తుందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ‘‘నగదుకు కొరత వల్ల జీడీపీలో 55 శాతంగా ఉన్న ప్రైవేటు వినియోగంపై నేరుగా ప్రభావం పడుతుంది. దీంతో మూడు, నాలుగో త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు తగ్గుముఖం పడుతుంది’’ అని క్రిసిల్ వివరించింది.

నోమురా అంచనా 6.5 శాతం
ముంబై: డీమోనటైజేషన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. ఈ ప్రభావం 2017 సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలోనూ కొనసాగవచ్చని పేర్కొంది. నోట్ల రద్దుకు ముందు ఆర్థిక రంగంలో పటిష్ట పరిస్థితులు ఉండగా... పెట్టుబడుల్లో బలహీనత కారణంగా తిరిగి ఆ స్థారుుకి చేరుకోవడానికి సమయం పడుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. వ్యవసాయేతర, వినియోగ ఆధారమైన రంగాల కార్యకలాపాలు నిదానించడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్  లించ్ సైతం ఇదే విధమైన అంచనాలను ప్రకటించింది. నోట్ల రద్దు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.9 శాతానికి దిగివస్తుందని తెలిపింది.

మరిన్ని వార్తలు