ఫెడ్ వడ్డనతో కుదేలైన చమురు రంగం

17 Dec, 2015 14:57 IST|Sakshi
ఫెడ్ వడ్డనతో కుదేలైన చమురు రంగం

హైదరాబాద్: అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చమురు రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.  ఫెడ్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచినా, చమురు  ధరలను బాగానే ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా పడిపోయాయి.   అంతర్జాతీయ మార్కెట్లో  డాలర్  పుంజుకోవడంతో.. చమురు  ధరలు ఏడేళ్ళ కనిష్టానికి క్షీణించాయి.  బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 35 డాలర్లకు చేరింది.    

ఫెడ్ రేట్లలో ఎంతో కొంత పెంపు తప్పనిసరిగా ఉంటుందని  ప్రపంచ ఆర్థిక నిపుణులు ముందే  అంచనాలు వేశారు.  ప్రస్తుత ఫెడ్ నిర్ణయంతో ఇప్పటికే గాడితప్పిన చమురు రంగం మాత్రం ఒక్కసారిగా కుదేలైంది. ఓపెక్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాలకు  ఫెడ్ నిర్ణయం సానుకూలమైనా, ధరల తగ్గుదల ఎగుమతి దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు.  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రపంచ మార్కెట్లపై  దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని  విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా 0 శాతం గరిష్ఠంగా 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను కనిష్ఠంగా 0.25, గరిష్టంగా 0.5 శాతానికి పెంచుతూ అమెరిడా ఫెడరల్ బ్యాంకు బుధవారం రాత్రి ప్రకటించింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ స్థితిలోనే ఉందని భావించిన ఫెడ్.. వడ్డీ రేట్లను పెంచటం ద్వారా మరింత ఆర్థిక పుష్ఠికి బాటలు వేయాలని  భావిస్తోంది. రానున్న కాలంలో మరిన్ని సార్లు వడ్డీ రేట్లను పెంచనున్నట్లు కూడా ఫెడరల్ బ్యాంక్ ప్రకటించింది.

మరిన్ని వార్తలు