రూపాయి కట్టడికి దిగుమతులపై ఆంక్షలు..

24 Sep, 2018 00:43 IST|Sakshi

న్యూఢిల్లీ: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ తెలిపారు. డాలర్‌తో రూపాయి మారకం విలువను 68–70 స్థాయికి తెచ్చే క్రమంలో నిత్యావసరయేతర ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు త్వరలో మరిన్ని చర్యలు ఉంటాయని వివరించారు. ఇందులో భాగంగా ఆంక్షలు విధించతగ్గ నిత్యావసరయేతర ఉత్పత్తులతో ఒక జాబితాను తయారు చేసినట్లు, అలాగే ప్రోత్సహించతగ్గ ఎగుమతులతో మరో జాబితాను కేంద్రం రూపొందించినట్లు వివరించారు.

రూపాయి ఏకంగా 12 శాతం మేర పతనం కావటం తాత్కాలికమైనదేనని ఆయన చెప్పారు. ప్రతిపాదిత చర్యలన్నింటినీ పూర్తిగా అమల్లోకి తేలేదని.. మిగతావన్నీ కూడా త్వరలోనే కేంద్రం ప్రకటిస్తుందని గర్గ్‌ చెప్పారు. తయారీ కంపెనీల విదేశీ రుణాల సమీకరణ నిబంధనలను, కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై పరిమితులను సడలించడం తదితర చర్యలు ఇప్పటికే తీసుకున్నప్పటికీ.. రూపాయి పతనం మాత్రం ఆగకుండా దాదాపు 72.91కి పడిపోయిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు