గతేడాది రికార్డు గరిష్టానికి కరెంట్ అకౌంట్ లోటు

28 Jun, 2013 03:54 IST|Sakshi
Gdp

 న్యూఢిల్లీ: ఒకపక్క రూపాయి విలువ పాతాళానికి పడిపోయి విలవిల్లాడుతుంటే.. దీనికి ఆజ్యం పోసేవిధంగా దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహానికి గండిపడుతోంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... గతేడాది(2012-13)లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) రికార్డు గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో పోలిస్తే 4.8 శాతానికి ఎగబాకింది. 87.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముడిచమురు, బంగారం దిగుమతులు పెరిగిపోవడమే క్యాడ్  ఎగిసేందుకు కారణం. అయితే, మార్కెట్ వర్గాల అంచనా(దాదాపు 5%)కంటే క్యాడ్ మెరుగుపడటం ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. రూపాయి క్షీణతకు అడ్డుకట్టవేయడంలో ఆపసోపాలు పడుతున్న సర్కారుకు ఉపశమనం ఇచ్చే విషయం. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, అదేవిధంగా మన ఆర్థిక వ్యవస్థనుంచి బయటికిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసాన్నే క్యాడ్‌గా పరిగణిస్తారు. కాగా, అంతక్రితం ఏడాది(2011-12)లో ఈ లోటు 4.2%(78.2 బిలియన్ డాలర్లు)గా ఉంది. జీడీపీతో పోలిస్తే 2.5% క్యాడ్ అనేది  ఆర్‌బీఐ ఆమోదనీయ స్థాయి.
 
 క్యూ4లో భారీగా మెరుగుదల...: 2012-13 చివరి త్రైమాసికం(జనవరి-మార్చి, క్యూ4)లో క్యాడ్ ఆశ్చర్యకరమైన రీతిలో మెరుగుపడింది. 3.6 శాతానికి తగ్గింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టమైన 6.7%కి దూసుకెళ్లడం తెలిసిందే. బంగారం దిగుమతులపై ఎడాపెడా నియంత్రణలు విధించిన నేపథ్యంలో రానున్నరోజుల్లో క్యాడ్ మరింత మెరుగుపడొచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కాగా, 2011-12 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ లోటు 4.4 శాతంగా నమోదైంది.
 
 దిగుమతుల్లో 45% క్రూడ్, బంగారానివే...
 గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం భారత్ దిగుమతుల్లో 45 శాతం వాటా ముడిచమురు, బంగారానిదేనని ఆర్‌బీఐ వెల్లడించింది. క్రూడ్ దిగుమతులు 9.3 శాతం ఎగబాకి 169.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక పుత్తడి దిగుమతులు మాత్రం 4.8 శాతం తగ్గి 53.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
 

మరిన్ని వార్తలు