వాట్సాప్ హ్యాకింగ్ : బీ కేర్‌ఫుల్‌

4 Apr, 2020 12:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం యావత్తూ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వ్యాపారాలు, వాణిజ్య సేవలు మూతపడ్డాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో కూడా హ్యాకర్లు తమ పనిలో బిజీ బిజీగా వున్నారు. అవును తాజా అంచనాల  ప్రకారం వాట్సాప్ ఖాతాలను  హ్యాక్ చేసే పనిలో హ్యాకర్లు మునిగిపోయారు. సైబర్ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని వాబేటా ఇన్ఫో తాజాగా హెచ్చరించింది. అనుమానాస్పద లింకులు పంపుతూ, వాటిల్లోకి లాగిన్ కావాలని కోరుతున్నారనీ, అమాయక యూజర్ల నుంచి ఓటీపీలను కొట్టేస్తున్నారని తెలిపింది. పలు ఈ మెయిల్స్ ను కూడా పంపుతున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంలో వాట్సాప్ వినియోగదారులు అప్రతమత్తంగా వుండాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే కొన్ని ఖాతాలు హ్యాక్   అయ్యాయని  ది టెలిగ్రాఫ్  నివేదించింది. 

గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుండి ఓటీపీ చెప్పాలంటూ మెసేజ్లను అందుకున్నామని పలువురు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో తాజా హెచ్చరికలను జారీ చేసింది. ఈ  ఓటీపీని  సంబధిత వాట్సాప్ ఖాతాలోకి చొరబడటానికి హ్యాకర్లు వినియోగిస్తున్నారని తెలిపింది. ఇది గమనించని వినియోగదారులు  మోసపోతున్నారనీ,  తద్వారా వ్యక్తిగత చాట్‌లు, ఫోన్ నంబర్, పేరు, ఇమెయిల్ ఐడి, బ్యాంక్ ఖాతా వివరాలు, ఫేస్‌బుక్ లాగిన్ లాంటి ఎంతో విలువైన డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేస్తున్నారని తెలిపింది. ఓటీపీ, భద్రతా కోడ్ విషయంలో యూజర్లు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని కోరింది. ఎప్పుడైనా అలాంటి సందేశాలను స్వీకరించినట్లయితే పట్టిచ్చుకోవద్దని కోరింది. దీంతో పాటు కొన్ని చిట్కాలను ట్విటర్లో షేర్ చేసింది. భద్రతా ధృవీకరణ కోడ్‌లను ఇష్టమైన వారితో సహా ఎవరితోనూ పంచుకోవద్దని వినియోగదారులను కోరింది. 

మరింత రక్షణ కోసం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న  (సెటింగ్/ ఎకౌంట్ /టూ స్టెప్ వెరిఫికేషన్) టూ స్టెప్ వెరిఫికేషన్ పద్ధతిని ఎనేబుల్ చేయాలి. తద్వారా వాట్సాప్ ఖాతాను హ్యాకర్ల బారినుంచి రక్షించుకోవచ్చని తెలిపింది. సెట్టింగుల మెనూకు వెళ్లి, గోప్యతా ఎంపికపై క్లిక్ చేసి, ప్రొఫైల్ ఫోటో ఎంపికను మార్చాలి. మై కాంటాక్ట్స్ అనేదానిపై క్లిక్ చేయాలి. అలాగే కాంటాక్ట్ లో లేని అనుమానాస్పద ఫోన్ నంబర్‌ను మెసేజ్  వస్తే.. విస్మరించండి. ఇకపై అలాంటి సందేశాన్ని పంపకుండా నిరోధించేలా సదరు నెంబర్ బ్లాక్ చేయాలని కోరింది. (చదవండి : లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు