టెల్కోల ‘డేటా’గిరీ..!

19 Apr, 2018 02:44 IST|Sakshi

బండిల్‌ ప్యాక్‌లకు కస్టమర్ల మొగ్గు

డేటాతోపాటు వాయిస్, ఎస్‌ఎంఎస్‌లు ఉచితం..

 45.6 కోట్లకు మొబైల్‌ డేటా యూజర్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీల మధ్య కొనసాగుతున్న పోటీతో ఇంటర్నెట్‌ వ్యయాలు భారీగా దిగొచ్చాయి. మరోవైపు దేశీయ కంపెనీలతోపాటు విదేశీ దిగ్గజాల నుంచి ఆకట్టుకునే స్మార్ట్‌ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంకేముంది మొబైల్‌లో డేటా వాడేవారి సంఖ్య భారత్‌లో అంచనాలను మించి పెరుగుతోంది. 2017 డిసెంబర్‌ నాటికే ఈ సంఖ్య 45.6 కోట్లు దాటింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17.22 శాతం అధికం. 2018 జూన్‌ నాటికి మొబైల్‌ డేటా కస్టమర్ల సంఖ్య సుమారు 47.8 కోట్లను తాకనుంది. డేటా ప్యాక్‌లతో బండిల్‌ కింద ఉచిత వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ను టెల్కోలు అందించడం కస్టమర్ల సంఖ్య ఇంతలా పెరిగేందుకు దోహదం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  

డేటాపైనే ఎక్కువ ఖర్చు... 
దేశంలో 2013 నుంచి వాయిస్‌ ప్యాక్‌లపై కస్టమర్లు చేస్తున్న ఖర్చు తగ్గుతూ వచ్చింది. స్మార్ట్‌ఫోన్లు వెల్లువెత్తడంతో వినియోగదార్లు క్రమేపీ డేటా వైపు మొగ్గు చూపారు. సోషల్‌ మీడియా, యూట్యూబ్, వీడియో చాటింగ్‌లతో డేటా వినియోగం పెరిగింది. దేశంలో నెలకు 80 లక్షల పైచిలుకు స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇంటర్నెట్‌ వినియోగం సగటు 2014 జూన్‌లో 70.10 ఎంబీ నమోదైంది. 2017 సెప్టెంబర్‌ నాటికి ఇది 1,600 ఎంబీకి చేరిందని ట్రాయ్‌ లెక్కలు చెబుతున్నాయి. దీనినిబట్టి డేటా వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్‌ జియో అరంగేట్రం తర్వాత డేటా వాడకం కట్టలుతెంచుకుంది. 2013లో కస్టమర్‌ సగటున రూ.100 వ్యయం చేస్తే, ఇందులో వాయిస్‌పైన 55 శాతం ఖర్చు ఉండేది. ఇప్పుడు వాయిస్‌పైన చేస్తున్న వ్యయం 16 శాతానికి వచ్చి చేరిందని కాంటార్‌–ఐఎంఆర్‌బీతో కలిసి ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన నివేదిక చెబుతోంది.  

బండిల్‌ ప్యాక్‌లవైపు.. 
డేటాతోపాటు ఉచిత వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఉన్న బండిల్‌ 4జీ ప్యాక్‌లవైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. చిన్న ప్యాక్‌లతో పోలిస్తే డేటా, వాయిస్‌ ప్రయోజనాలు అధికంగా ఉండడం ఇందుకు కారణం. డేటా, వాయిస్‌ కాల్స్‌కు వేర్వేరు ప్యాక్‌లు తీసుకుంటే కస్టమర్‌కు తడిసిమోపెడవుతుంది. ప్రస్తుతం టెలికం రంగంలో ట్రెండ్‌ బండిల్‌ ప్యాక్‌లవైపు వెళ్తోందని ఐడియా ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు బండిల్‌ ప్యాక్‌ కింద లోకల్, ఎస్టీడీ ఉచిత అపరిమిత కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. కాగా, తక్కువ విలువ ఉన్న టాప్‌ అప్స్‌ విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయని స్థానిక ఆర్‌కే కమ్యూనికేషన్స్‌ ప్రతినిధి కేశవ్‌ తెలిపారు. బండిల్‌ ప్యాక్‌ల వాటా 60–70 శాతానికి చేరిందని చెప్పారు. 

టాప్‌ ప్యాక్‌లు  ఇవే.. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో రిలయన్స్‌ జియో 84 రోజుల కాలపరిమితితో రూ.399 ప్యాక్‌ను అందుబాటులో తెచ్చింది. ప్రతిరోజు 1.5 జీబీ డేటా ఉచితం. ప్రతిరోజు 1.4 జీబీ డేటాతో 82 రోజుల వ్యాలిడిటీ ప్యాక్‌ను ఎయిర్‌టెల్, ఐడియా ప్రవేశపెట్టాయి. ఎయిర్‌టెల్‌ రూ.448, ఐడియా రూ.449 ధరకు ఈ ప్యాక్‌ను విక్రయిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు రూ.199లకు ప్రతిరోజు 1.4 జీబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.485 ప్యాక్‌లో 90 రోజులపాటు ప్రతిరోజు 1.5 జీబీ 3జీ డేటాను ఇస్తోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు