ధర, వాస్తు, నీళ్లకే ప్రాధాన్యం

18 Jan, 2020 01:24 IST|Sakshi

ఆ తర్వాతే రవాణా, వసతుల ఎంపికలు  

గృహ కొనుగోలుదారుల ఎజెండాలివే 

అందుబాటు ధర, వాస్తు, మెరుగైన నీటి సరఫరా.. ఇవే గృహాల కొనుగోళ్లలో కస్టమర్ల ప్రధాన ఎజెండాలు. ఆ తర్వాతే రవాణా సౌకర్యాలు, ఆధునిక వసతులను కోరుకుంటున్నారని రియల్టీ పోర్టల్‌ నోబ్రోకర్‌.కామ్‌ తెలిపింది. రూ.60 లక్షల లోపు దర, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే జై కొడుతున్నారు. భద్రత, స్కూల్స్, ఆసుపత్రుల వంటి సోషల్‌ ఇన్‌ఫ్రా కస్టమర్లూ ఉన్నారండోయ్‌!  

సాక్షి, హైదరాబాద్‌: నోబ్రోకర్‌.కామ్‌ ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోని 70 లక్షల రిజిస్టర్‌ యూజర్లతో ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. వీటిలో 84 శాతం మంది అందుబాటు ధర, 83 శాతం మంది నీటి సరఫరా, 73 శాతం మంది గృహ వాస్తు, 59 శాతం మంది మెరుగైన రవాణా సౌకర్యాలున్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. 53 శాతం మంది కార్‌ పార్కింగ్, 42 శాతం మంది భద్రత,  24 శాతం మంది లిఫ్ట్, 19 శాతం స్కూల్స్, 13 శాతం మంది ఆసుపత్రులు, 9 శాతం మంది జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ ఉండాలని కోరుకున్నారు. కూకట్‌పల్లి, మియాపూర్, మణికొండ, ఉప్పల్, నిజాంపేట ప్రాంతాల్లో కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నారు. 

2020 గృహ విభాగానిదే.. 
గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గడం, ప్రభుత్వం అందుబాటు గృహాలకు రాయితీలు అందిస్తుండటం వంటి కారణాలతో 2020లో గృహ విక్రయాలు జోరందుకుంటాయి. మెట్రో నగరాల్లోనూ మూలధన వృద్ధి స్థిరంగా ఉండటం, ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుండటం వంటివి కూడా విక్రయాల వృద్ధికి కారణాలే. ఈ ఏడాది 64 శాతం మంది అద్దెదారులు సొంతిల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని సర్వే తెలిపింది. గతేడాది ఇది 54 శాతంగా ఉంది. ఇందులోనూ 64 శాతం మంది 35 ఏళ్లలోపే సొంతింటి కలను తీర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 35–45 ఏళ్ల మధ్య 26 శాతం, 45 ఏళ్ల పైన 10 శాతం మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నారు. గృహ కొనుగోళ్లలో అత్యంత ఆసక్తిగా హైదరాబాదీలే ఉన్నారు. ఇక్కడ 69 శాతం సొంతింటి ఎంపికలో నిమగ్నమై ఉంటే.. బెంగళూరులో 65 శాతం, ముంబైలో 59 శాతం, చెన్నైలో 55 శాతం, పుణేలో 56 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 58 శాతంగా ఉంది. 

హైదరాబాద్‌లో రూ.54 కోట్లు
నో బ్రోకర్‌.కామ్‌తో 2019లో మెట్రో నగరాల్లో రూ.1,154 కోట్ల బ్రోకరేజ్‌ తగ్గిందని కంపెనీ తెలిపింది. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా రూ.372 కోట్లు, ముంబైలో రూ.342 కోట్లు, పుణేలో రూ.206 కోట్లు, చెన్నైలో రూ.180 కోట్లు, హైదరాబాద్‌లో రూ.54 కోట్ల బ్రోకరేజ్‌ ఆదా అయింది.

బ్రోకర్లు తగ్గుతున్నారు
రియల్టీ రంగంలో బ్రోకర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2018లో గృహ కొనుగోళ్లలో 14 శాతంగా ఉన్న మధ్యవర్తులు.. 2019లో 11 శాతానికి తగ్గింది. బ్రోకర్ల క్షీణత కొనుగోలుదారులకే లాభం. ఇళ్ల కొనుగోళ్లలో 35 శాతం స్నేహితులు, బంధువుల ద్వారా, 28 శాతం రియల్టీ వెబ్‌సైట్స్, 26 శాతం టులెట్‌ బోర్డ్స్‌ ద్వారా సంప్రదిస్తున్నారు. 
– సౌరభ్‌ గార్గ్, కో–ఫౌండర్, నోబ్రోకర్‌.కామ్‌    

మరిన్ని వార్తలు