హైదరాబాద్‌లో సీఈఎస్‌టీఏటీ రీజనల్ బెంచ్

15 Dec, 2015 02:02 IST|Sakshi
హైదరాబాద్‌లో సీఈఎస్‌టీఏటీ రీజనల్ బెంచ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్‌ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (సీఈఎస్‌టీఏటీ) రీజనల్ బెంచ్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దీన్ని సోమవారం సీఈఎస్‌టీఏటీ ప్రెసిడెంట్‌గా ఉన్న జస్టిస్ గూడ రఘురామ్ ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్థులో పని ప్రారంభించింది.

వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, వ్యక్తులకు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్లు పన్నులు, డ్యూటీలు తదితర బకాయిలకు సంబంధించి ఇచ్చే ఆదేశాలను సవాల్ చేయడానికి ఈ బెంచ్ ఉపకరించనుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బెంగళూరులోనే బెంచ్ ఉంది. ఏడాదికి ఒకటిరెండు రోజులు మాత్రం హైదరాబాద్‌లో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటయ్యేది.

ఫలితంగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే వారంతా బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో రీజనల్ బెంచ్ ఏర్పాటు డిమాండ్ ఏళ్ళుగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం దేశ వ్యాప్తంగా ఆరు బెంచ్‌ల ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలో అనుమతించింది. హైదరాబాద్‌లో బెంచ్ అందుబాటులోకి రాగా... మిగిలిన ఐదింటిలో చండీఘర్, అలహాబాద్‌ల్లో కొత్తగా, న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో అదనపు బెంచ్‌లు ఏర్పాటుకానున్నాయి.

మరిన్ని వార్తలు