కార్పొరేట్‌ పన్నుకు కోత?

12 Jan, 2018 00:39 IST|Sakshi

హామీ మేరకు తగ్గించాలని ఒత్తిళ్లు

25 శాతానికి తీసుకొస్తామని లోగడ జైట్లీ ప్రకటన

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్ను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై దేశ కార్పొరేట్‌ రంగం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పన్ను రేటు 30 శాతంగా ఉండగా దాన్ని 25 శాతానికి తగ్గిస్తామని మూడేళ్ల క్రితం కేంద్రం హామీ ఇచ్చింది. దాన్ని ఇప్పటికైనా నెరవేర్చాలని కార్పొరేట్‌ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరుతోంది.

అమెరికాలో కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గించినందున అంతర్జాతీయ స్థాయిలో మన పన్ను రేటు సైతం పోటీపడేలా మార్పులు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 2015–16 బడ్జెట్‌  సందర్భంగా జైట్లీ కార్పొరేట్‌ పన్నును 30% నుంచి 25%కి  నాలుగేళ్లలో తగ్గిస్తామని ప్రకటించారు. ఇది పెట్టుబడులకు, అధిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఇప్పటికీ అది తగ్గగక పోవటంతో కనీసం 28 శాతానికైనా తగ్గించాలని పరిశ్రమల సమాఖ్యలు కోరుతున్నాయి.

ఈ బడ్జెట్‌లో చేస్తారని ఆశిస్తున్నాం: ఫిక్కీ
దీనిపై ఫిక్కీ ప్రెసిడెంట్‌ రషేష్‌షా స్పందిస్తూ... ఆర్థిక ప్రతికూలతల నేపథ్యంలో మంత్రి జైట్లీ కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గిస్తారని ఆశించడం లేదన్నారు. కనీసం 28 శాతానికైనా తీసుకొచ్చేలా కృషి చేయాలని, అది ఈ బడ్జెట్లో చేస్తారని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

18 శాతం చేయాలి... సీఐఐ: సీఐఐ మాత్రం కార్పొరేట్‌ పన్నును ఏకంగా 18 %కి తగ్గించేయాలని డిమాండ్‌ చేసింది. అంతేకాదు, పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పార్టనర్‌షిప్‌ సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, ఏవోపీలు, కో–ఆపరేటివ్‌ సొసైటీలకు కూడా వర్తింపజేయాలని, దీంతో భిన్న సంస్థల మధ్య సమాంతర వాటా ఉంటుందని సూచించింది.

సమీక్షించాల్సిన అవసరం ఉంది...
మనదేశ కార్పొరేట్‌ పన్ను అంతర్జాతీయంగా ఉన్న రేట్లతో పోలిస్తే పోటీపడేట్లుగానే ఉందన్నారు శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ పార్ట్‌నర్‌ అమిత్‌ సింఘానియా. అయితే, ఇటీవల అమెరికాలో కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గించినందున 2018 బడ్జెట్‌లో ఇక్కడా సమీక్షించాల్సి ఉందని, ఎందుకంటే ఇది అమెరికా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుందని చెప్పారాయన.

మరిన్ని వార్తలు