ప్రభుత్వ బ్యాంకుల్లో శాఖల కోత

26 Dec, 2017 00:57 IST|Sakshi

నష్టాల్లో ఉన్న వాటిని     మూసేయండి...

బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన

సంస్కరణల్లో భాగంగానే!  

ఆచరణ ఇప్పటికే ఆరంభం  

న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) ఇక వ్యయ నియంత్రణపై తీవ్రంగా దృష్టిపెట్టనున్నాయి. ఇందులో భాగంగా శాఖలకు కత్తెర వేయనున్నాయి. కేంద్రం కూడా బ్యాంకుల శాఖల క్రమబద్ధీకరణ దిశగా చర్యలు మొదలుపెట్టింది. బ్యాంకింగ్‌ సంస్కరణల్లో భాగంగా... ఖర్చులను తగ్గించుకోవడం కోసం నష్టాలతో నడుస్తున్న దేశ, విదేశీ శాఖలను క్రమబద్ధీకరించుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది. ‘‘నష్టాలను ఎదుర్కొంటున్న బ్యాంకు శాఖలను కొనసాగించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్‌ షీట్లపై భారం మోయాల్సిన అవసరం లేదు. కనుక బ్యాంకులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు భారీ పొదుపు చర్యలపైనే కాకుండా ఈ తరహా చిన్న వాటిపైనా దృష్టి పెట్టాలి’’ అని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రభుత్వరంగంలోని అగ్రగామి బ్యాంకులు ఎస్‌బీఐ, పీఎన్‌బీ ఇప్పటికే ఈ చర్యలను అమల్లో పెట్టడం గమనార్హం. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు దేశవ్యాప్తంగా తనకు 59 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా, వాటిని ఏకంగా 10 ప్రాంతీయ శాఖలకు తగ్గించుకుంది. వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతోపాటు, పరిపాలన వ్యయాలను తగ్గించుకునేందుకు ఇలా చేసింది.  

ఒక దేశంలో ఒక్క బ్యాంకు చాలు... 
విదేశీ శాఖల క్రమబద్ధీకరణ విషయమై చర్చించి, లాభసాటిగా లేని వాటిని మూసివేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఒక దేశంలో ఒకటికి మించిన బ్యాంకులు ఉండాల్సిన అవసరం లేదన్నది ఆర్థిక శాఖ ఆలోచనగా అధికార వర్గాలు తెలిపాయి. ఐదారు బ్యాంకులు కలసి ఓ సబ్సిడరీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా నిధుల ఆదాపై దృష్టి సారించాలని సూచించింది. శాఖలను మూసేయడం, సబ్సిడరీలను విక్రయించడంతోపాటు అధిక రాబడులను ఇచ్చే మార్కెట్లపై మరింత దృష్టి సారించే చర్యల్ని బ్యాంకులు పాటించనున్నాయి. ఆర్థిక శాఖ సూచనల మేరకు పీఎన్‌బీ బ్రిటన్‌ సబ్సిడరీ అయిన పీఎన్‌బీ ఇంటర్నేషనల్‌లో వాటాను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ కూడా విదేశీ శాఖల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. బ్యాంకు ఆఫ్‌ బరోడాకు 24 దేశాల్లో మొత్తం 107 శాఖలు, కార్యాలయాలు ఉన్నాయి. ఎస్‌బీఐకి 36 దేశాల్లో 195 కార్యాలయాలు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా