సైబర్‌ సెక్యూరిటీ ప్రొడక్ట్‌ తయారు చేస్తున్నారా?

1 Sep, 2017 00:28 IST|Sakshi

రూ.5 కోట్ల వరకూ ఆర్‌ అండ్‌ డీ నిధుల్ని ఇస్తామంటున్న కేంద్రం  
న్యూఢిల్లీ: సైబర్‌ సెక్యూరిటీ ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీలకు కేంద్రం బొనాంజా ప్రకటించింది. స్టార్టప్‌ గానీ, మరే ఇతర సంస్థ గానీ సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి పరిశోధన చేసి, ఒరిజినల్‌ ఉత్పత్తుల్ని అభివృద్ధి చేస్తే... దానికోసం పెట్టిన మొత్తం ఖర్చును రూ.5 కోట్ల వరకూ తాము తిరిగి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. దీన్ని ‘చాలెంజ్‌ గ్రాంట్‌’గా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రకటించారు. ఇక్కడ అసోచామ్‌ నిర్వహించిన ఒక సైబర్‌ సెక్యూరిటీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దేశంలో డిజిటల్‌/ ఇన్‌ఫర్మేషన్‌ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకే సైబర్‌ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఏర్పడిందని తెలిపారు.

 మొబైల్‌ ఫోన్లలోని సైబర్‌ సెక్యూరిటీ ఫైర్‌వాల్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సిందిగా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు నోటీసులు జారీచేశామని గుర్తుచేశారు. ‘మేం టెలిఫోన్లకు సైబర్‌ సెక్యూరిటీ ప్రమాణాలుండాలని భావిస్తున్నాం. వాటి రూపకల్పన జరుగుతోంది. ఈ విషయంలో రాజీపడం’ అన్నారు. డిజిటల్‌ గవర్నెన్స్‌ వల్ల ప్రభుత్వానికి గత మూడేళ్లలో రూ.57,000 కోట్లు మిగిలాయన్నారు. డీమోనిటైజేషన్‌ తర్వాత భీమ్‌ ప్లాట్‌ఫామ్‌లో లావాదేవీలు పెరిగాయని పేర్కొన్నారు. భీమ్‌ యాప్‌ ట్రాన్సాక్షన్లు రోజుకు 3,700 నుంచి 5.4 లక్షలకు ఎగశాయన్నారు. విలువ పరంగా రోజుకు రూ.1.93 కోట్లు నుంచి రూ.87 కోట్లకు పెరిగిందన్నారు.

ఎస్‌జీఐలో మిగులువాటాను కొంటున్న సెంబ్‌కార్ప్‌
ముంబై: సోలార్, విండ్‌వపర్‌ వ్యాపారంలో నిమగ్నమైన తమ గ్రూప్‌ కంపెనీ సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఎనర్జీ (ఎస్‌జీఐ)లో మిగిలిన వాటాను ఐడీఎఫ్‌సీ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ నుంచి రూ. 1,410.2 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. డీల్‌ 2018 తొలి త్రైమాసికంలో పూర్తికాగలదని సెంబ్‌కార్ప్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ నీల్‌  చెప్పారు. దీంతో ఎస్‌జీఐ పూర్తి వాటా తమ చేతికి వస్తుందని ఆయన తెలిపారు. 1200 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన సోలార్, విండ్‌ పవర్‌ ప్లాంట్లు ఏడు రాష్ట్రాల్లో ఎస్‌జీఐకి వున్నాయి.

మరిన్ని వార్తలు