నూతన ఆవిష్కరణల బ్రాండ్గా సైయంట్

9 Sep, 2016 01:57 IST|Sakshi
నూతన ఆవిష్కరణల బ్రాండ్గా సైయంట్

2020 నాటికి 3 రెట్ల ఆదాయం..
18,000లకు ఉద్యోగుల సంఖ్య
సైయంట్ ఫౌండర్ మోహన్ రెడ్డి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా నిలవాలని సైయంట్ లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో డిజైన్, బిల్డ్, మెయింటెయిన్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. కంపెనీ ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 1991లో జియోస్పటికల్ సర్వీసులతో ప్రారంభమై విభిన్న విభాగాలకు విస్తరించామన్నారు. 21 దేశాలు, 38 కేంద్రాలతో మొత్తం 13,200 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. మార్కెట్ క్యాప్ రూ.5,000 కోట్లకు ఎగసిందన్నారు. 1997లో రూ.10,000 పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్‌కు 300 రెట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు.

రెండేళ్లలో బిలియన్ డాలర్..
గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ రూ.3,100 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి ఆదాయం మూడు రెట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు సైయంట్ ఎండీ కృష్ణ బోధనపు తెలిపారు. రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ కంపెనీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్ రంగాలు రానున్న రోజుల్లో మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఈ రంగాలపై ఫోకస్ చేస్తామని చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు ఉంటాయని అన్నారు. తాము సేవలందిస్తున్న రంగాల్లోని స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మొత్తం 18,000లు దాటొచ్చని అంచనాగా చెప్పారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత ఏడాది నియామకాలు 1,000 దాకా ఉండొచ్చని అన్నారు.

మరిన్ని వార్తలు