సైయంట్ లాభం 94 కోట్లు

24 Apr, 2015 00:21 IST|Sakshi
సైయంట్ లాభం 94 కోట్లు

నికర లాభంలో 34% వృద్ధి
- 23 శాతం వృద్ధితో రూ. 730 కోట్లకు చేరిన ఆదాయం
- షేరుకు రూ. 5 డివిడెండ్ ప్రకటన
- సైయంట్ చైర్మన్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్, ఐటీ సేవలను అందించే సైయంట్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికరలాభంలో 34 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 70 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 94 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 23 శాతం వృద్ధితో రూ. 730 కోట్లుగా నమోదయ్యింది. గురువారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  సైయంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్ కృష్ణ బోదనపు మాట్లాడుతూ కరెన్సీ ఒడిదుడుకులు ఈ త్రైమాసిక ఫలితాలపై కొంత ఒత్తిడికి గురి చేసినప్పటికీ ఏడాది మొత్తంపై రికార్డు స్థాయి ఫలితాలను నమోదు చేయడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

2014-15 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికరలాభం 33 శాతం వృద్ధితో రూ. 266 కోట్ల నుంచి రూ. 353 కోట్లకు చేరగా, ఆదాయం 24 శాతం పెరిగి రూ. 2,206 కోట్ల నుంచి రూ. 2,735 కోట్లకు చేరింది. ఈ సమావేశంలో పాల్గొన్న సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాటాదారులకు 100 శాతం డివిడెండ్‌ను ప్రకటించినట్లు తెలిపారు. రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ. 5 డివిడెండ్ లభిస్తుందని, గత సెప్టెంబర్‌లో ప్రకటించిన రూ.3 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమన్నారు. దీంతో 2014-15 ఏడాదిలో 160 శాతం డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
 
ఏరోస్పేస్‌పై దృష్టి
కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలతో టేకోవర్లకు వినియోగించనున్నట్లు మోహన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఏరోస్పేస్ టెక్నాలజీ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, దీనికి సంబంధించి యూరోప్‌కు చెందిన ఒక కంపెనీ టేకోవర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇది ఇంకా పరిశీలన దశలోనే ఉందని, ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేమని ఆయన తెలిపారు. గతేడాది మూడు కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైయంట్ దగ్గర రూ. 656 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. గతేడాది నికరంగా 3,289 మంది ఉద్యోగులను తీసుకున్నామని, ఈ ఏడాది కూడా ఇదే సంఖ్యలో నియామకాలు ఉండే అవకాశం ఉందని కృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు