29% తగ్గిన సైయంట్ లాభం

22 Apr, 2016 01:14 IST|Sakshi
29% తగ్గిన సైయంట్ లాభం

నికర లాభం రూ.66 కోట్లు
ఆదాయం రూ.816 కోట్లు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ 2015-16 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే 29 శాతంపైగా తగ్గింది. సమీక్ష కాలంలో నికర లాభం రూ.94 కోట్ల నుంచి రూ.66 కోట్లకు పడిపోయింది. ఈ త్రైమాసికంలో వన్ టైం పేమెంట్ కింద రూ.84.3 కోట్లు చెల్లించడం లాభం తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది. ఆదాయం రూ.730 కోట్ల నుంచి రూ.816 కోట్లకు ఎగిసింది. ఇక ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.353 కోట్ల నుంచి రూ.326 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం 13 శాతం అధికమై రూ.2,736 కోట్ల నుంచి రూ.3,095 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 6 శాతం ఎగిసి రూ.425 కోట్లను నమోదు చేసింది. నాలుగు కంపెనీల కొనుగోళ్లతోపాటు పెరిగిన డివిడెండు చెల్లింపులతో కూడా క్యాష్ బ్యాలెన్స్ అత్యధికంగా రూ.774 కోట్లు నమోదు చేసిందని కంపెనీ వెల్లడించింది.

 నిరాశ పర్చిన ఏడాది..: 2015-16లో కొత్తగా 91 క్లయింట్లు తోడయ్యారని కంపెనీ తెలిపింది. కంపెనీకి 2015-16 సవాల్‌తో కూడిన సంవత్సరమని సైయంట్ ఎండీ కృష్ణ బోదనపు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘కీలకమైన ఇంజనీరింగ్, డేటా నెట్‌వర్క్ ఆపరేషన్ విభాగాలు నిలకడగా ఉన్నాయి. ఈ విభాగాల మార్జిన్లు 100 పాయింట్లు పెరిగాయి. ఈ ఏడాది ఆదాయం అంచనాల కంటే తగ్గి నిరాశపర్చింది. 2016-17 బాగుంటుందన్న ధీమా ఉంది. కీలక విభాగాలు రెండంకెల వృద్ధి నమోదు చేస్తాయి. మార్జిన్లు 150 పాయింట్లు మెరుగవుతాయన్న అంచనాలు ఉన్నాయి’ అని చెప్పారు. బీఎస్‌ఈలో సైయంట్ షేరు 3.94% తగ్గి రూ.482.15 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు