సైయంట్‌ చేతికి బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌

12 Sep, 2017 00:29 IST|Sakshi
సైయంట్‌ చేతికి బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌ తాజాగా అమెరికాకు చెందిన బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ ఎంతన్నది వెల్లడించనప్పటికీ సుమారు 5.5 మిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. తమ అనుబంధ సంస్థ సైయంట్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ద్వారా 100 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని సైయంట్‌ తెలిపింది.

రేమండ్‌ ఫోర్జియోన్‌ కుటుంబ వ్యాపారంగా 1965లో బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌ను ప్రారంభించినట్లు వివరించింది. తొలుత స్థానిక తయారీ కంపెనీలకు డిజైన్‌ సర్వీసులు అందించిన ఈ సంస్థ ఆ తర్వాత పనిముట్ల తయారీ తదితర వ్యాపారాల్లోకి కూడా విస్తరించింది. ప్రస్తుతం ఇంజిన్‌ అసెంబ్లీ యంత్రపరికరాల తయారీ, ఇంజిన్‌ ఫ్యాక్టరీ ఆధునికీకరణ సేవలు తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌లో 47 మంది ఉద్యోగులు ఉండగా, ఆదాయాలు 8–9 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.  

ఆరో కొనుగోలు..
’డిజైన్‌–బిల్డ్‌–మెయింటెయిన్‌’ వ్యూహం కింద సైయంట్‌ గత మూడేళ్లుగా కొనుగోలు చేసిన సంస్థల్లో బీఅండ్‌ఎఫ్‌ ఆరోది అవుతుంది. ప్రస్తుతం 155 మిలియన్‌ డాలర్ల మేర నగదు నిల్వలు ఉన్నాయని, తమ వ్యూహానికి అనుగుణమైన సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలు అన్వేషిస్తూనే ఉంటామని సైయంట్‌ పేర్కొంది. నిర్మాణం, నిర్వహణ సేవలను మరింతగా మెరుగుపర్చుకునే దిశగా బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌ కొనుగోలు తోడ్పడుతుందని సైయంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ విభాగం) ఆనంద్‌ పరమేశ్వరన్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు