అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన మిస్త్రీ 

4 Aug, 2018 00:19 IST|Sakshi

ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులపై సవాలు 

న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ)ను ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ ఆశ్రయించారు. టాటా గ్రూపు సంస్థ ‘టాటా సన్స్‌’ చైర్మన్‌గా తనను తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ సైరస్‌ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కొట్టివేస్తూ జూలై 9న తీర్పునిచ్చిన విషయం గమనార్హం. అంతేకాదు, మిస్త్రీని తప్పించడం చట్టబద్ధమేనని, ఆ అధికారం టాటా సన్స్‌ బోర్డుకు ఉందని ఎన్‌సీఎల్‌టీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

బోర్డులో మెజారిటీ సభ్యులు మిస్త్రీపై విశ్వాసం కోల్పోవడం వల్లే తప్పించినట్టు ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ పేర్కొంది. రతన్‌ టాటా తదితరుల ప్రవర్తనపై ఆయన చేసిన ఆరోపణలను కూడా తోసిపుచ్చడం జరిగింది. దీంతో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలకు వ్యతిరేకం గా ఎన్‌సీఎల్‌ఏటీ వద్ద పిటిషన్‌ దాఖలు చేసినట్టు మిస్త్రీ వర్గాలు తెలిపాయి. ఈ పిటిషన్‌ ఎప్పుడు విచారణకు వస్తుందన్నది ఇంకా స్పష్టం కాలేదు. మిస్త్రీ 2012లో టాటా సన్స్‌ చైర్మన్‌గా నియమితులవ్వగా, 2016 అక్టోబర్‌లో ఆయన్ను అనూహ్యంగా తప్పించడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు