మిస్త్రీ.. కుటుంబాన్ని త్యాగం చేశారు: మహిళా ఎంపీ

26 Oct, 2016 18:32 IST|Sakshi
మిస్త్రీ.. కుటుంబాన్ని త్యాగం చేశారు: మహిళా ఎంపీ
టాటా గ్రూపును బలోపేతం చేయడానికి, ఆ సంస్థలను లాభాల బాట పట్టించడానికి సైరస్ మిస్త్రీ ఎంతగానో కష్టపడ్డారని, అందుకోసం ఆయన తన కుటుంబ జీవితాన్నికూడా త్యాగం చేశారని మిస్త్రీ కుటుంబానికి స్నేహితురాలు, మహిళా ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఆయన పనితీరు బాగోలేదని చెప్పడం సరికాదని ఆమె అన్నారు. సైరస్ మిస్త్రీ, ఆయన భార్య రోహికా చాగ్లా ఇద్దరూ తనకు మంచి మిత్రులని ఆమె చెప్పారు. 
 
టాటా గ్రూపు చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీ (48)ని సోమవారం సాయంత్రం మార్కెట్లు ముగిసిన తర్వాత హఠాత్తుగా ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మళ్లీ రతన్ టాటాను నియమించిన విషయం తెలిసిందే. టాటా గ్రూపులో అతిపెద్ద స్టేక్‌హోల్డర్లలో ఒకటైన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడానికి ప్రధాన కారణం ఆయన పనితీరు బాగోకపోవడమేనని చెప్పారు. అయితే, సైరస్ మిస్త్రీ తన కుటుంబ వ్యాపారాలను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రముఖ మరాఠా నాయకుడైన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అన్నారు. టాటా గ్రూపు సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆయన చాలా కష్టపడ్డారని తెలిపారు.
మరిన్ని వార్తలు